Updated : 22 Apr 2022 16:50 IST

Crime News: హనుమకొండలో దారుణం.. విద్యార్థిని గొంతుకోసిన ప్రేమోన్మాది

సుబేదారి: ఉమ్మడి వరంగల్‌ జిల్లా హనుమకొండ గాంధీ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది విద్యార్థిని గొంతుకోశాడు. సుబేదారి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగంపేట మండలం నకిరేపల్లి గ్రామానికి చెందిన అనూష (23) ఎంసీఏ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్రూప్స్‌కి సన్నద్ధమవుతోంది. సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన అజార్‌.. ప్రేమ పేరుతో అనూష వెంట పడేవాడు. అయితే అతని ప్రేమను ఆమె నిరాకరించింది.

అనూష శుక్రవారం ఉదయం వరంగల్‌ వచ్చింది. విషయం తెలుసుకున్న అజార్‌ అక్కడికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన అజార్‌ కత్తితో అనూష గొంతు కోశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన విద్యార్థినిని స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎంజీఎం వైద్యులు వెల్లడించారు. ముగ్గురు వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని.. 48 గంటల పాటు అబ్జర్‌వేషన్‌లో ఉంచుతామని వైద్యులు తెలిపారు.

అనూష పరిస్థితిపై ఆరా తీసిన గవర్నర్‌..

విద్యార్థినిపై ప్రేమోన్మాది జరిపిన దాడి విషయమై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనూష ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్‌ ఆరా తీశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడిన గవర్నర్ అనూష పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అనూషకు తగిన వైద్యం అందిస్తున్నట్లు వివరించిన సూపరింటెండెంట్.. నిపుణులైన వైద్యులతో ఉన్నతస్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని