Hyderabad: నార్సింగిలో దారుణం.. సమయం ముగిసినా పెట్రోల్‌ పోసిన పాపానికి..

హైదరాబాద్‌ శివారు నార్సింగి పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెట్రోల్‌బంకులో పనిచేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు.

Updated : 07 Mar 2023 12:23 IST

పెట్రోల్‌ బంక్‌ సిబ్బందిపై దాడి.. ఒకరి మృతి

రాజేంద్రనగర్‌: హైదరాబాద్‌ శివారు నార్సింగి పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెట్రోల్‌బంకులో పనిచేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ దాడిలో సంజయ్‌ అనే కార్మికుడు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. పెట్రోల్‌ బంకు సమయం ముగిసినా కనికరించి పెట్రోల్‌ పోసిన పాపానికి నిండు ప్రాణాన్ని పొట్టపెట్టుకున్నారు. 

వివరాల్లోకి వెళితే.. సోమవారం అర్ధరాత్రి దాటాక నార్సింగి సమీపం జన్వాడలోని ఓ పెట్రోల్‌ బంకు వద్దకు కారు వచ్చి ఆగింది. పెట్రోల్‌ పోయాలని అందులోని యువకులు అక్కడి సిబ్బందిని కోరారు. సమయం అయిపోయిందని.. పెట్రోల్‌ లేదని బంక్‌లో పనిచేస్తున్న కార్మికులు తెలిపారు. చాలా దూరం వెళ్లాలని కారులో ఉన్న యువకులు చెప్పడంతో కార్మికులు కనికరించి పెట్రోల్‌ పోశారు. బిల్లు చెల్లింపు చేసే సమయంలో యువకులు తమ కార్డును ఇచ్చారు. స్వైప్‌ మెషిన్‌ లేదని.. నగదు ఇవ్వాలని క్యాషియర్‌ కోరారు. దీంతో తమకే ఎదురు మాట్లాడతారా? అంటూ కారులో ఉన్న యువకులు రెచ్చిపోయారు. క్యాషియర్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో క్యాషియర్‌ను కొట్టొద్దంటూ సంజయ్‌ అనే కార్మికుడు అడ్డుపడ్డాడు. అడ్డుగా వచ్చిన సంజయ్‌పైనా పిడిగుద్దులతో విరుచుకుపడటంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. 

మిగిలిన కార్మికులు సంజయ్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు మృతిచెందాడు. మరోవైపు పెట్రోల్‌ కోసం కారులో వచ్చిన యువకులు అక్కడిని నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సంజయ్‌ మృతితో అతడి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్‌, మల్లేశ్‌, అనూప్‌లుగా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని