Hyderabad: పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు.. కస్టడీ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు

బంజారాహిల్స్ పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిందితుల కస్టడీ ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా ఈనెల 14న నిందితులు అభిషేక్, అనిల్‌ను చంచల్‌గూడ జైలు నుంచి తీసుకెళ్లిన బంజారాహిల్స్ పోలీసులు...

Updated : 18 Apr 2022 15:51 IST

హైదరాబాద్‌: బంజారాహిల్స్ పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిందితుల కస్టడీ ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా ఈనెల 14న నిందితులు అభిషేక్, అనిల్‌ను చంచల్‌గూడ జైలు నుంచి తీసుకెళ్లిన బంజారాహిల్స్ పోలీసులు వివిధ కోణాల్లో వారిని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సమర్పించిన కస్టడీ రిపోర్టులో పోలీసులు పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది.

‘‘నిందితులు అనిల్‌, అభిషేక్‌లను 36 గంటల పాటు విచారించాం. ఏడాది వ్యవధిలో అభిషేక్‌ తన కుటుంబంతో రెండు సార్లు విదేశాలకు వెళ్లారు. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు, ఐపీఎల్‌ చూసేందుకు విదేశాలకు వెళ్లినట్లు చెప్పాడు. అభిషేక్‌ కాల్‌ డేటాలో ఉన్న అందరి గురించి ఆరా తీశాం. డ్రగ్స్‌ విక్రేతలతో అభిషేక్‌కు సంబంధాలున్నట్లు ఆధారాలు లభించలేదు. డ్రగ్స్‌ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని అభిషేక్‌ చెప్పాడు. పబ్‌లోకి డ్రగ్స్‌ ఎలా వచ్చాయో తనకు తెలియదన్నాడు. పబ్‌లో ప్రవేశం కోసం తనకు నిత్యం అనేక ఫోన్లు వస్తుంటాయని తెలిపాడు. పబ్‌లో కొకైన్‌ విక్రయానికి సంబంధించిన ఆధారాలు దొరకలేదు. అభిషేక్‌కు సంబంధించి గత మూడేళ్ల కాల్‌డేటాను పరిశీలించాం. గత 7 నెలలుగా పబ్‌ను లీజుకు తీసుకొని నడుపుతున్నట్లు అభిషేక్‌ చెప్పాడు. పబ్‌లో ఉన్న సీసీ కెమెరాల్లోనూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. పబ్‌కు వచ్చే హైప్రొఫైల్‌ కస్టమర్స్‌ కోసమే యాప్‌ అని.. మంచి ప్రొఫైల్‌ ఉంటేనే పబ్‌లోకి అనుమతిస్తారని చెప్పాడు. వయసు ధ్రువీకరణ పత్రం చూశాకే లోపలికి పంపిస్తామన్నాడు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వస్తే మేమేమీ చేయలేమన్నాడు’’ అని కస్టడీ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని