Crime: క్రెడిట్‌ కార్డు మోసం.. ఎంపీకే టోకరా!

ఛత్తీస్‌గడ్‌కు చెందిన భాజపా రాజ్యసభ ఎంపీ, రాష్ట్ర మాజీ మంత్రి రామ్‌విచార్‌ నేతమ్‌ క్రెడిట్‌ కార్డు మోసానికి గురైంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆయన కార్డు నుంచి......

Published : 12 Jun 2021 01:37 IST

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భాజపా రాజ్యసభ ఎంపీ, రాష్ట్ర మాజీ మంత్రి రామ్‌విచార్‌ నేతమ్‌ క్రెడిట్‌ కార్డుతో గుర్తు తెలియని వ్యక్తి లావాదేవీలు జరిపాడు. దీంతో ఆయన కార్డు నుంచి రూ.37వేలు దుర్వినియోగమైనట్టు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. రాయ్‌పూర్‌లోని తెలిబండ పోలీస్‌ స్టేషన్లో గురువారం రాత్రి ఎంపీ బంధువు ఒకరు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎంపీ పేరిట ఉన్న క్రెడిట్‌కార్డును దుర్వినియోగపరిచిన మోసగాడు రూ.36,844ల మేర లావాదేవీలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న క్రెడిట్‌ కార్డు నుంచి లావాదేవీ జరిగినట్టు వివరించారు. ఈ క్రెడిట్‌కార్డు వ్యాలిడిటీ 2020లోనే ముగియడం గమనార్హం. అయితే, ఎంపీ ఆ క్రెడిట్‌ కార్డును రెన్యువల్‌ చేసుకోలేదు. ఈ క్రమంలోనే ఆయనకు తెలియకుండా కార్డును రెన్యువల్‌ చేసి రూ.36వేలకు పైగా లావాదేవీలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.  బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ ఎంపీకి ఫోన్‌ చేసి మొత్తం రూ.45,668లు చెల్లించాలని చెప్పడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. 

క్రెడిట్‌ కార్డు తన వద్ద లేదని, దాని వ్యాలిడిటీ ఎప్పుడో ముగిసినట్టు ఎంపీ రామ్‌ విచార్‌ నేతమ్‌ ఆ ఎగ్జిక్యూటివ్‌కి చెప్పారు. తాను ఎలాంటి లావాదేవీలు చేయలేదని వివరించారు. అయినా బిల్లు చెల్లించాలని కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ నుంచి ఫోన్‌ వస్తుండటంతో అసలేం జరిగిందో తెలుసుకొనేందుకు ఆయన బ్యాంకుకు వెళ్లారు. మోసం జరిగిందని గ్రహించిన అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని