Crime news: యమునా నదిలో 35మందితో పడవ బోల్తా.. నలుగురి మృతి.. ముమ్మర గాలింపు

రాఖీ పండుగ వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. యమునా నదిలో బాందా జిల్లాలో ఓ పడవ మునిగిపోయింది. ప్రమాదం సమయంలో పడవలో దాదాపు......

Updated : 11 Aug 2022 19:49 IST

లఖ్‌నవూ: రాఖీ పండుగ వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. యమునా నదిలో బాందా జిల్లాలో ఓ పడవ మునిగిపోయింది. ప్రమాదం సమయంలో పడవలో దాదాపు 30 నుంచి 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. 
మర్క నుంచి ఫతేపూర్‌ జిల్లాలోని జారౌలి ఘాట్‌కు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీసినట్టు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పడవలో రాఖీ పండగ కోసం సొంతూళ్లకు వెళ్తున్న మహిళలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.  ఎగువన కురిసిన వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం.  ప్రమాదం సమయంలో పడవలో 30-35మంది ఉన్నట్టు ఎస్పీ అభినందన్‌ తెలిపారు. గల్లంతైన వారి కోసం డైవర్ల సాయంతో గాలిస్తున్నట్టు తెలిపారు. అదనపు ఎస్పీ లక్ష్మీ నివాస్‌ మిశ్రా మాట్లాడుతూ.. ఏడెనిమిది మంది ఈదుకుంటూ సురక్షితంగా బయటకు వచ్చేశారని.. మిగతా వారంతా మునిగిపోయారన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

బలమైన గాలులు వీయడం వల్లే..

బలమైన గాలులు వీడయం వల్లే బోటు మునిగిపోయిందని బాందా ఎస్పీ అభినందన్‌ వెల్లడించారు. ఇప్పటివరకు 15మందిని సురక్షితంగా కాపాడామని.. 17మంది గల్లంతయ్యారన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయన్నారు.

సీఎం యోగి విచారం

ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తంచేశారు. స్థానిక ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి తగిన వైద్యసాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని