
పబ్జీ గేమ్‌లో గొడవ.. ప్రాణం తీసింది!
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో పిల్లల చేతికి సెల్‌ఫోన్ ఇవ్వడంతో ఓ విషాద సంఘటన జరిగింది. పబ్జీ గేమ్ విషయంలో ఇద్దరు చిన్నారుల మధ్య తలెత్తిన ఘర్షణ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మైనర్ బాలుడైన నిందితుణ్ని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల ఉల్లాల్ ప్రాంతానికి చెందిన అకీఫ్ అనే చిన్నారిని ఇంటి పక్కన ఉండే మరో బాలుడు తనతో పాటు పబ్జీ ఆడాల్సిందిగా కోరాడు. అయితే ఆట మధ్యలో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది.
అకీఫ్ తోటి బాలుడిపై రాళ్లు విసిరాడు. దానికి కోపోద్రిక్తుడైన ఆ బాలుడు ఓ పెద్ద రాయిని అకీఫ్‌పై వేశాడు. దీంతో అతడికి తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. భయపడ్డ ఆ బాలుడు మృతదేహాన్ని అరిటాకులతో కప్పేసి అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడు మైనర్ కావడంతో అతడికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ ఎన్.శశి కుమార్ స్పందిస్తూ చిన్నారులకు ఫోన్లు ఇచ్చినప్పుడు పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు.