Kidnap: బాలుడిని చిలకలూరిపేటలో కిడ్నాప్‌ చేసి కావలిలో వదిలిపెట్టారు!

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఓ బాలుడిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. పోలీసులు వెతుకుతున్నారనే భయంతో నెల్లూరు జిల్లా కావలిలో బాలుడిని వదిలిపెట్టి వెళ్లారు.

Updated : 03 Oct 2022 16:13 IST

చిలకలూరిపేట గ్రామీణ: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఓ బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసులు వెతుకుతున్నారన్న సమాచారంతో బాలుడిని దుండగులు విడిచిపెట్టడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చిలకలూరిపేటకు చెందిన అరుణకు తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా పేరంబాకంకు చెందిన ధాన్యం వ్యాపారి శరవణన్‌తో వివాహమైంది. దసరా పండుగ సందర్భంగా అరుణ చిలకలూరిపేటలోని పుట్టింటికి వచ్చారు. పట్టణంలోని చార్లెస్ కాన్వెంట్ సమీపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో ఆదివారం రాత్రి పూజల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె 8 ఏళ్ల కుమారుడు రాజీవ్ సాయి.. ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. పూజ తర్వాత బాలుడు కనిపించలేదు. అదే సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

రాజీవ్ సాయి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో బాలుడి తల్లి అరుణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతలోనే చెన్నైలో ఉంటున్న బాలుడి తండ్రి శరవణన్‌కు కిడ్నాపర్ల నుంచి ఫోన్ వచ్చింది. రాజీవ్ తమ వద్ద ఉన్నాడని.. రూ.కోటి ఇస్తేనే విడిచిపెడతామని బెదిరించారు. విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పడంతో అర్బన్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు అర్ధరాత్రి నుంచి కిడ్నాపర్ల కోసం వెతుకులాట ప్రారంభించాయి.

శరవణన్‌కు వచ్చిన ఫోన్ నంబర్‌తో పాటు, కిడ్నాప్ సమయంలో ఆలయ సమీపంలోని ఫోన్ నంబర్లను పోలీసులు విశ్లేషించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. దీంతో దొరికిపోతామని భావించిన కిడ్నాపర్లు.. నెల్లూరు జిల్లా కావలిలో కారుతో సహా బాలుడు రాజీవ్‌ను వదిలిపెట్టి పారిపోయారు. అనంతరం పోలీసులు చేరుకుని బాలుడిని కావలి నుంచి చిలకలూరిపేటకు తీసుకుని వస్తున్నారు. బాలుడు దొరకడంతో కుటుంబసభ్యులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాలుడిని దగ్గర బంధువులే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని