PUBG: ఆన్‌లైన్‌ గేమ్‌లు వద్దన్నందుకు.. కన్నతల్లినే కాల్చిచంపిన బాలుడు..!

పబ్‌జీ (PUBG) గేమ్‌ ఆడవద్దన్నందుకు ఏకంగా కన్న తల్లినే హతమార్చిన ఘటన వెలుగు చూసింది.

Updated : 08 Jun 2022 18:57 IST

మృతదేహాన్ని 2 రోజులపాటు ఇంట్లోనే ఉంచిన యూపీ మైనర్‌

లఖ్‌నవూ: ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడిన యువత.. ఒకానొక స్థాయిలో అత్యంత దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. పబ్‌జీ (PUBG) గేమ్‌ ఆడవద్దన్నందుకు ఏకంగా కన్న తల్లినే హతమార్చిన ఘటన వెలుగు చూసింది. అనంతరం తల్లి మృతదేహాన్ని గదిలోనే పెట్టి తాళం వేశాడు. ఈ దారుణాన్ని చూసిన చెల్లిని బెదిరించిన యువకుడు.. రెండు రోజులపాటు స్నేహితులతో ఇంట్లోనే కాలక్షేపం చేశాడు. చివరకు గదినుంచి దుర్వాసన ఎక్కువ కావడంతో రూమ్‌ ఫ్రెష్‌నర్‌ చల్లి జాగ్రత్తపడిన యువకుడి తీరు ప్రతిఒక్కరిని నిర్ఘాంతపరిచింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీజీఐ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యమునాపురం కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి (16ఏళ్ల బాలుడు, తొమ్మిదేళ్ల బాలిక) నివాసముంటోంది. ఆర్మీ అధికారి ఐన ఆమె భర్త ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటుపడిన ఆ పదహారేళ్ల కుర్రాడు తల్లితో ఎప్పుడూ గొడవ పడేవాడు. పబ్‌జీ గేమ్‌కు దూరంగా ఉండమని తల్లి ఎంత వారించినా వినని ఆ యువకుడు.. ఇంట్లో ఉన్న (తండ్రి లైసెన్స్‌డ్‌ గన్‌) తుపాకితో తల్లిని కాల్చి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ఓ గదిలో పెట్టి తాళం వేశాడు. అంతేకాకుండా ఇళ్లు మొత్తం రూమ్‌ఫ్రెష్‌నర్‌ చల్లి బయటకు దుర్వాసన రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఘటన జరిగిన సమయంలో అతని సోదరి అక్కడే ఉంది. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో చిన్నారి వణికిపోయి గదిలోనే ఉండిపోయింది.

శనివారం రాత్రి ఈ ఘటన జరగగా.. తల్లి మృతదేహాన్ని ఓ గదిలో పెట్టి, మరో గదిలో చెల్లిని నిర్బంధించాడు. అయితే, రెండురోజుల తర్వాత గది నుంచి దుర్వాసన ఎక్కువవడంతో చివరకు ఈ విషయాన్ని తన తండ్రికి తెలియజేశాడు. ఆయన వెంటనే ఈ విషయాన్ని పొరుగింటివారికి తెలపడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే కొంత కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. పోస్టుమార్టం కోసం పంపించారు. అనంతరం మైనర్‌ బాలుడిని విచారించగా తొలుత కట్టుకథ అల్లేందుకు ప్రయత్నించాడని యూపీ పోలీసులు వెల్లడించారు. చివరకు వాస్తవాన్ని బహిర్గతం చేసిన బాలుడు.. ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడకుండా అడ్డుకున్నందునే తన తల్లిని హతమార్చినట్లు అంగీకరించాడని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని