ఉగ్ర నీడలో అన్నదమ్ములు

వారిద్దరూ అన్నదమ్ములు. ఒకరేమో భారత నౌకాదళ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేయడంలో కీలకపాత్ర పోషించగా..

Updated : 15 Apr 2021 11:37 IST

 విశాఖ గూఢచర్య రాకెట్‌ కేసులో ఇమ్రాన్‌ నిందితుడు 

అమరావతి: వారిద్దరూ అన్నదమ్ములు. ఒకరేమో భారత నౌకాదళ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేయడంలో కీలకపాత్ర పోషించగా.. మరొకరు సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని శత్రు దేశాలకు అందించారు. చివరికి ఇద్దరూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు చిక్కి కటకటాల్లోకి వెళ్లారు. విశాఖపట్నం గూఢచర్య రాకెట్‌ కేసులో గతంలో పట్టుబడ్డ ఇమ్రాన్‌ గిటేలీ.. ఉత్తర్‌ప్రదేశ్‌ గూఢచర్య రాకెట్‌ కేసులో తాజాగా అరెస్టైన అనస్‌ గిటేలీల ఉగ్ర కథ ఇది. గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లా గోద్రా ప్రాంతానికి చెందిన ఈ గిటేలీ సోదరులు.. పాకిస్థాన్‌ ఐఎస్‌ఐకు ఏజెంట్లుగా పనిచేస్తూ భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించారనేది ప్రధాన అభియోగం. వస్త్ర వ్యాపారం ముసుగులో వీరు పాకిస్థాన్‌కు తరచూ వెళ్తూ ఐఎస్‌ఐతో సంబంధాలు ఏర్పరచుకొని వారు చెప్పినట్లు చేసేవారని ఎన్‌ఐఏ దర్యాప్తులో గుర్తించింది. వీరిని వెనుక నుంచి నడిపించింది ఎవరు? ఈ రెండు కేసుల వెనుక ఉన్న సూత్రధారి ఒకరేనా? ఇంకా ఏమైనా సామీప్యతలు ఉన్నాయా? అనే కోణాల్లో ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది.

ఐఎస్‌ఐ కోసం పనిచేస్తూ...

విశాఖపట్నం గూఢచర్య రాకెట్‌ కేసులో నిందితుడైన ఇమ్రాన్‌ గిటేలీ తొలుత లేడిస్‌ టైలర్‌గా.. ఆ తర్వాత ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. కరాచీ వస్త్రాలను భారత్‌లో విక్రయించే ముసుగులో ఐఎస్‌ఐ ఏజెంటు అవతారమెత్తాడు. అసఫ్‌ అనే వ్యక్తి నుంచి వచ్చే ఆదేశాల్ని పాటిస్తూ విశాఖపట్నం, కార్వర్, ముంబయిలోని నౌకాదళ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగుల్ని ప్రలోభాలకు గురిచేసేవాడు. వారి నుంచి దేశంలోని కీలక సంస్థలు, రక్షణ స్థావరాలు, అంతరిక్ష పరిశోధన కేంద్రాలు, వ్యూహాత్మక ప్రదేశాలు, ఇతర రక్షణ సమాచారానికి సంబంధించిన వివరాలు, చిత్రాలు, వీడియోలు సేకరించి వాటిని పాకిస్థాన్‌ నిఘా విభాగానికి చేరవేసేవాడు. అందుకు ప్రతిగా ఆయా నేవీ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు జమ చేసేవాడు. ఇలా ఏడాది వ్యవధిలోనే రూ.65 లక్షల వరకూ జమచేసినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. గతేడాది సెప్టెంబరులో అతడిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు మార్చిలో అభియోగపత్రం దాఖలు చేశారు.

పాక్‌ కుట్రలో భాగస్వామై...

ఇమ్రాన్‌ సోదరుడు అనస్‌ పాకిస్థాన్‌ కుట్రలో భాగస్వామిగా మారి.. వారు చెప్పినట్లు చేసేవాడనేది ప్రధాన అభియోగం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్‌ జిల్లాకు చెందిన సౌరభ్‌ శర్మ అనే వ్యక్తి ఇండియన్‌ ఆర్మీలో కొన్నాళ్ల పాటు జవానుగా పనిచేసి 2020 జూన్‌లో అనారోగ్య కారణాలతో బయటకొచ్చేశాడు. అంతకు ముందు సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇతను అనస్‌ ద్వారా ఐఎస్‌ఐ ఏజెంట్లకు చేరవేసేవాడు. అందుకు ప్రతిగా సౌరభ్‌ శర్మ భార్యకు చెందిన బ్యాంకు ఖాతాలో అనస్‌ ఎప్పటికప్పుడు డబ్బులు జమ చేసేవాడు. యూపీ ఉగ్రవాద నిరోధక బృందం తొలుత ఈ కుట్రను ఛేదించింది. దాని ఆధారంగా ఎన్‌ఐఏ ఇటీవల కేసు నమోదు చేసి అనస్‌ను అరెస్టు చేసింది.

డబ్బులు ఎలా వచ్చాయి?

ఇద్దరు అన్నదమ్ములూ ఒకే తరహా నేరానికి సంబంధించిన అభియోగాలపై కొన్ని నెలల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు కావడం సంచలనమైంది. ఇద్దరి నేర విధానం ఒకటే కావటంతో.. నౌకదళ, సైనిక ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసిన డబ్బులు వీరికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి ద్వారా అందాయి? ఐఎస్‌ఐ తరఫున స్థానికంగా ఇంకా ఎవరెవరు పనిచేస్తున్నారు? వారి మూలాలేంటి? అనే కోణంలో ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది. ఇమ్రాన్‌ గిటేలీని నడిపించిన అసఫ్‌ అనే వ్యక్తే అనస్‌ గిటేలీని కూడా నడిపించాడా? పాకిస్థాన్‌కు చెందిన ఇక్బాల్‌ దోబా ప్రమేయం ఈ రెండు కేసుల్లోనూ ఉందా? తదితర వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని