Crime: రూ.125 కోట్ల మోసానికి పాల్పడ్డ ఆర్మీ అధికారి!

దేశానికి రక్షణ కల్పించిన సైనికాధికారే.. కోట్ల రూపాయాల మేర మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోవాలని యత్నించాడు. నకిలీ టెండర్లతో కాంట్రాక్టర్లని బురుడి కొట్టించి.. తనకున్న అప్పులన్నీ తీర్చాలనుకున్నాడు.. కానీ, వారి ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు. ఆర్మీ, పోలీసులు

Published : 16 Jan 2022 10:31 IST

గురుగ్రామ్‌: దేశానికి రక్షణ కల్పించిన సైనికాధికారే.. కోట్ల రూపాయాల మేర మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోవాలని యత్నించాడు. నకిలీ టెండర్లతో కాంట్రాక్టర్లని బురుడి కొట్టించి.. తనకున్న అప్పులన్నీ తీర్చాలనుకున్నాడు. కానీ, వారి ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు. ఆర్మీ, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌)లో డిప్యూటీ కమాండెంట్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌ యాదవ్‌.. 2012లో ఆర్మీలో చేరాడు. డిప్యూటేషన్‌పై నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌(ఎన్‌ఎస్‌జీ) కన్‌స్ట్రక్షన్‌ విభాగంలో గతేడాది వరకు విధులు నిర్వహించాడు. కాగా.. తన ఆస్తినంతా స్టాక్‌మార్కెట్లో పొగొట్టుకున్న ప్రవీణ్‌.. రుణాలు తీసుకొని మరీ ట్రేడింగ్‌ చేయడంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో ఆ అప్పులు తీర్చడానికి ఓ పథకం రచించాడు. ఎస్‌ఎన్‌జీకి పలు నిర్మాణాలు చేపట్టాలని నకిలీ టెండర్లు ప్రకటించాడు. లావాదేవీలు జరపడం కోసం ఎన్‌ఎస్‌జీ పేరు మీదే మానేసర్‌లో నకిలీ బ్యాంకు ఖాతా తెరిచాడు. టెండర్ల కోసం కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో నగదును అందులో జమ చేశారు. అలా వారి నుంచి దాదాపు రూ. 125కోట్లు వసూలు చేశాడు. ఈ మోసం బయటపడకముందే విదేశాలకు పారిపోవాలని.. స్వచ్ఛంద పదవీవిరమణకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, రెండు నెలలు గడిచినా నిర్మాణ పనులపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఎన్‌ఎస్‌జీని సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. మోసపోయినట్లు గుర్తించిన కాంట్రాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌ఎస్‌జీలోనే పనిచేసే తన సోదరి సాయంతో ఈ మోసానికి పాల్పడ్డాడని, ఆ డబ్బులో రూ.50కోట్లు మేర తనకున్న రుణాలు చెల్లించాడని పోలీసులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని