cryptocurrency: కంబోడియా కేంద్రంగా క్రిప్టోకరెన్సీ దందా

కంబోడియా కేంద్రంగా జరుగుతున్న క్రిప్టోకరెన్సీ దందా మరోసారి వెలుగులోకి వచ్చింది.

Published : 10 Jul 2024 03:09 IST

చైనా ముఠా అధీనంలో 5 వేల మంది భారత యువకులు
టీజీసీఎస్‌బీలో జగిత్యాల యువకుడి ఫిర్యాదుతో వెలుగులోకి..

ఈనాడు, హైదరాబాద్‌: కంబోడియా కేంద్రంగా జరుగుతున్న క్రిప్టోకరెన్సీ దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. భారత్‌ ఇతర దేశాల నుంచి ఉద్యోగాల పేరిట యువకులను రప్పించుకుంటున్న నేరస్థులు వారితో బలవంతంగా సైబర్‌ మోసాలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా వందలాది మంది భారతీయులు అక్కడి శిబిరాల్లో చిక్కుకొని ఉన్నారు. ఇటీవలే తిరిగి ఇంటికి చేరుకున్న జగిత్యాల యువకుడు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ)కి ఫిర్యాదు చేయడంతో అక్కడి అకృత్యాలు బహిర్గతమయ్యాయి.

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగమంటూ..

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్లకు చెందిన బాధిత యువకుడు(35) 2022లో కోరుట్లకు చెందిన వంశీకృష్ణ అనే ఏజెంట్‌ను సంప్రదించారు. అతను అజర్‌బైజాన్‌లో రోస్టాబౌట్‌(కూలీ) పని ఇప్పిస్తానని రూ.2 లక్షలు తీసుకున్నాడు. చివరకు కంబోడియాలో డేటాఎంట్రీ ఆపరేటర్‌గా మాత్రమే ఉద్యోగం ఉందని చెప్పడంతో.. నవంబరు 7న యువకుడు హైదరాబాద్‌ నుంచి మలేషియా మీదుగా కంబోడియా వెళ్లారు. అక్కడ నమ్‌పెన్‌ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఓ ట్యాక్సీ డ్రైవర్‌ వచ్చి భారతీయ రెస్టారెంటుకు తీసుకెళ్లి పాస్‌పోర్టు తీసుకున్నాడు. 10-12 రోజుల తర్వాత మరో వ్యక్తి వచ్చి పదుల సంఖ్యలో కాల్‌సెంటర్లు నడుస్తున్న భారీ ప్రాంగణానికి తీసుకెళ్లాడు. అతని పేరు జోష్‌గా మార్చారు. నెలకు 600 అమెరికన్‌ డాలర్ల వేతనం ఇస్తామని చెప్పారు. అక్కడున్న చైనీయుల అదుపులో సుమారు 5 వేల మంది భారతీయులున్నా ఒకరినొకరితో మాట్లాడనిచ్చేవారు కాదు. ‘క్యాసినో’ పేరుతో పిలిచే కాంప్లెక్స్‌లో వందలాది మందితో సైబర్‌నేరాలు చేయిస్తుంటారు. ఈ భవనానికి సుమారు 100 మందితో బందోబస్తు ఉంటుంది. టెలీకాలర్లుగా ఫోన్లు చేసి క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలొస్తాయంటూ మోసగించడమే వీరి పని. ప్రతి నెల కోత విధిస్తూ జీతం చెల్లించేవారు. నాలుగో నెలలో బాధితుడికి తీవ్రమైన చెవినొప్పితో బాధపడుతూ తనను ఇంటికి పంపించేయాలని పలుమార్లు ప్రాధేయపడటంతో 3 వేల అమెరికన్‌ డాలర్లు చెల్లించాలని మెలికపెట్టారు. దీంతో బాధితుడు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నానికి చెందిన స్నేహితుడిని అడిగారు. అతను క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బు జమ చేయడంతో యువకుడిని పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని