Covid norms violation: ఆ ఎమ్మెల్యే కుమారుల పెళ్లికి 2వేల మంది అతిథులు

వివాహ వేడుకలో కొవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించిన ఓ ఎమ్మెల్యే ఇద్దరు కొడుకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.....

Published : 30 Jul 2021 01:15 IST

కేసు నమోదు చేసిన షోలాపూర్‌ పోలీసులు

పుణె: వివాహ వేడుకలో కొవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించిన ఓ ఎమ్మెల్యే ఇద్దరు కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బార్సి నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే రాజేంద్ర రౌత్‌ తన ఇద్దరు కుమారులకు బార్సి పట్టణంలోని లక్ష్మీ సోపాన్‌ అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ కమిటీ ఆవరణలో ఆదివారం వివాహం వేడుక నిర్వహించారు. ఓకే వేదికగా జరిగిన పెళ్లిళ్లకు పలువురు రాజకీయ ప్రముఖులు సహా 2000 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. దీంతో తొలుత ఈవెంట్‌ ఆర్గనైజర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇద్దరు కుమారుల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్టు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఎస్‌డీ గిరిగోశావి వెల్లడించారు. కొవిడ్‌ ఆంక్షలు అమలులో ఉండటంతో వివాహ వేడుకలకు కేవలం 50మంది వరకే అనుమతి ఉండగా.. ఎమ్మెల్యే కుమారుల పెళ్లిళ్లకు 2500 నుంచి 3వేల మంది వరకు హాజరైనట్టు పోలీసులు తెలిపారు. వీరిలో అనేకమంది మాస్క్‌లు కూడా ధరించలేదని తెలిపారు. ఈ వేడుకకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌, ఇతర పార్టీల నేతలు కూడా హాజరయ్యారు.

మరోవైపు, దేశంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతుందని భావిస్తున్న జనం కొవిడ్‌ నిబంధనల్ని గాలికొదిలేస్తున్నారు. మాస్క్‌లు ధరించకుండా బహిరంగంగా తిరగడమే కాకుండా ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా పెళ్లిళ్లు, సామాజిక కార్యక్రమాలకు హాజరవుతుండటంతో కొవిడ్‌ మళ్లీ డేంజర్‌ బెల్‌ మోగిస్తోంది. ఫలితంగా కేసులు మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని