Avinash Reddy: మరోసారి అవినాష్‌రెడ్డి ఇంటికి సీబీఐ.. స్వయంగా నోటీసులు అందజేత

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందులకు చేరుకుని ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించారు.

Updated : 16 May 2023 17:13 IST

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందులకు చేరుకుని ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించారు. వివేకా హత్య జరిగిన రోజు అవినాష్‌రెడ్డి (MP Avinash Reddy) ఆయన ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత సమయంలో వెళ్లారు? ఎంత దూరం ఉంది?అనే అంశాలను సీబీఐ అధికారులు పరిశీలించినట్టు తెలుస్తోంది.

సీబీఐ తొలుత ఇచ్చిన నోటీసుల ప్రకారం ఇవాళ ఉదయం అవినాష్‌రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే, ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున విచారణకు రాలేనని.. మరో నాలుగు రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున గడువుకావాలని సీబీఐకి లేఖ రాశారు. అవినాష్‌ లేఖపై స్పందించిన సీబీఐ అధికారులు ఈనెల 19న విచారణకు హాజరుకావాలని  వాట్సాప్‌ ద్వారా నోటీసు పంపారు. ఈరోజు మధ్యాహ్నం పులివెందులలోని అవినాష్‌ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు 19న విచారణకు రావాలని స్వయంగా నోటీసులు అందజేశారు. ఆ సమయంలో ఎంపీ ఇంట్లో లేకపోవడంతో ఆయన డ్రైవర్‌ నాగరాజుకు నోటీసులు అందజేశారు. 

అవినాష్ అనుచరులను విచారిస్తున్న సీబీఐ

వివేకా హత్యకేసు దర్యాప్తులో భాగంగా పలువురికి సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. అందులో భాగంగా ఇవాళ ఎంపీ అనుచరులుగా భావిస్తున్న ముగ్గురు వైకాపా నేతలను కోటిలోని సీబీఐ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. వారిలో వైకాపాకు చెందిన సింహాద్రిపురం మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, వేముల మండలం నల్లచెరువు పల్లె గ్రామానికి చెందిన రవీంద్రారెడ్డి, అదే మండలానికి చెందిన నాగ విశ్వేశ్వర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ ముగ్గురి నుంచి వివేకా హత్య జరిగిన రోజు చోటు చేసుకున్న పరిణామాలను సీబీఐ అధికారులు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని