Hyderabad: లంచం డబ్బు వదిలి.. పరుగో పరుగు..!

దొంగలు పరుగెత్తడం.. వారిని పట్టుకోవడానికి పోలీసులు వెంటాడడం సాధారణమే. లంచం తీసుకున్న ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ అధికారులను చూసి.. నడిరోడ్డుపై పరిగెత్తగా వారు వెంటాడి పట్టుకున్న సంఘటన గురువారం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

Updated : 14 Jun 2024 10:57 IST

అనిశాకు చిక్కిన సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌
రోడ్డుపై వెంటాడి పట్టుకున్న సిబ్బంది
రూ.3 లక్షల సొమ్ము స్వాధీనం

లంచం డబ్బుతో సుధాకర్‌ 

ఈనాడు- హైదరాబాద్‌: దొంగలు పరుగెత్తడం.. వారిని పట్టుకోవడానికి పోలీసులు వెంటాడడం సాధారణమే. లంచం తీసుకున్న ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ అధికారులను చూసి.. నడిరోడ్డుపై పరిగెత్తగా వారు వెంటాడి పట్టుకున్న సంఘటన గురువారం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. బషీర్‌బాగ్‌లోని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) కార్యాలయం ముందు గురువారం సాయంత్రం సినీఫక్కీలో ఈ హైడ్రామా నడించింది. ఈ సంఘటనలో.. రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్‌ చామకూరి సుధాకర్‌ అనిశాకు దొరికాడు. 

నిందితుడితో లాలూచీ.. 

బోయిన్‌పల్లికి చెందిన కన్సల్టెంట్‌ మణిరంగస్వామి అయ్యర్‌ (45).. తనకు వ్యాపార విస్తరణ సలహాలిస్తానంటూ రూ.లక్షల్లో మోసం చేశాడని అల్వాల్‌కు చెందిన ఫార్మా వ్యాపారి సీవీఎస్‌ సత్యప్రసాద్‌ (56) చేసిన ఫిర్యాదు మేరకు సీసీఎస్‌లో కేసు నమోదైంది. దీన్ని ఈవోడబ్ల్యూ టీమ్‌-7 ఇన్‌స్పెక్టర్‌ చామకూరి సుధాకర్‌ దర్యాప్తు చేస్తున్నాడు. కేసు మాఫీ చేయాలని నిందితుడు మణిరంగస్వామి.. సుధాకర్‌ను కలిశాడు. ఇన్‌స్పెక్టర్‌ రూ.15 లక్షల లంచం డిమాండ్‌ చేసి.. అడ్వాన్సుగా గతంలో రూ.5 లక్షలు తీసుకున్నాడు. బేరసారాల అనంతరం మరో రూ.3 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. 

అరెస్టు.. రిమాండ్‌

ఇద్దరి అవగాహన మేరకు.. గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో మణిరంగస్వామి సీసీఎస్‌ కార్యాలయం ఎదురుగా ఉండే పార్కింగ్‌ ప్రదేశం వద్ద సుధాకర్‌ను కలుసుకుని.. రూ.3 లక్షలు ఇచ్చాడు. ఈలోపు తనవైపు వస్తున్న కొందరు వ్యక్తులు అనిశా అధికారులని సుధాకర్‌ గుర్తించాడు. డబ్బున్న బ్యాగును అక్కడే వదిలేసి నడిరోడ్డుపై పరుగెత్తగా.. ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ సతీశ్, ముగ్గురు కానిస్టేబుళ్లు వెంటాడి పట్టుకున్నారు. డబ్బు సంచిని స్వాధీనం చేసుకుని సుధాకర్‌ చేతుల్ని పరీక్షించగా పాజిటివ్‌ వచ్చింది. వెంటనే అతడిని అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండు విధించారు. 

ఎస్సైగా అంతా సెప‘రేటు’

2009 బ్యాచ్‌కు చెందిన సుధాకర్‌ పనిచేసిన ప్రతిచోటా ఆరోపణలే. ఎల్బీనగర్, మేడిపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్‌లో ఎస్సైగా పనిచేశాడు. ఎక్కువగా క్రైం విభాగంలో పనిచేసిన సుధాకర్‌.. కేసుల విషయంలో ఉన్నతాధికారుల్ని తప్పుదోవ పట్టించేవాడని సమాచారం. ఘట్‌కేసర్‌లో క్రైం ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో అప్పటి ఇన్‌స్పెక్టర్‌కు ఇతని ప్రవర్తనపై అనుమానమొచ్చి సైబర్‌క్రైం విభాగానికి మార్చారు. తర్వాత వివిధ ప్రాంతాల్లో పనిచేసిన సుధాకర్‌ సీసీఎస్‌కు బదిలీ అయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని