Ap News: కోళ్లకు కత్తులు.. రూ.కోట్లలో పందేలు

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేలు, జూదాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. రూ.కోట్లలో నగదు చేతులు మారుతుండగా మద్యం ఏరులై పారుతోంది. కోడి పందేలకు అనుమతి లేదని పోలీసులు ఆర్భాటంగా ప్రకటనలు చేసినా బరులు..

Published : 16 Jan 2022 03:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేలు, జూదాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. రూ.కోట్లలో నగదు చేతులు మారుతుండగా మద్యం ఏరులై పారుతోంది. కోడి పందేలకు అనుమతి లేదని పోలీసులు ఆర్భాటంగా ప్రకటనలు చేసినా బరులు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. కోడి పందేల బరులు, జూదశాలల వద్ద కొవిడ్‌ నిబంధనలు గాలికొదిలేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కోడిపందేలు నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాపురం వద్ద ఏర్పాటు చేసిన భారీ బరిలో పెద్ద ఎత్తున పందేలు జరగ్గా రూ.కోట్లలో నగదు చేతులు మారింది. రాత్రి సమయంలో ఫ్లడ్‌ లైట్లు ఏర్పాటు చేసి జూదాన్ని కొనసాగించారు. కైకలూరు, గుడివాడ, పామర్రు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలోనూ పెద్ద ఎత్తున కోడి పందేల బరులు వెలిశాయి. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురం 1వ వార్డు పరిధిలో జోరుగా కోడి పందేలు, పేకాట నిర్వహిస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్ సభ్యులు పలువురి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. గుడ్లవల్లేరు మండలం అంగలూరులో కోడి పందేల బరి వద్ద వివాదం తలెత్తింది. పందెం విషయంలో గొడవకు దిగిన ఇరు వర్గాల యువకులు చొక్కాలు పట్టుకుని తన్నుకునేందుకు సిద్దమయ్యారు. అక్కడున్న వారు ఇరు వర్గాలను అడ్డుకుని పంపించేశారు.

గోదావరి జిల్లాల్లో..
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండక్కి కోడిపందేలు పెట్టింది పేరు. ఇక్కడి పందేల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు తరలివచ్చారు. పండుగ 3 రోజులు భారీగా పందేలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.  తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 450కి పైగా బరుల్లో పందేలు జరుగుతున్నాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే నిన్న  పందేల్లో రూ.60 నుంచి రూ.70 కోట్ల వరకు చేతులు మారి ఉంటాయని  సమాచారం. ప్రధానంగా కోనసీమలోని కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో అన్ని హంగులతో 10కి పైగా బరులు ఏర్పాటు చేశారు. పెద్ద బరిలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల మధ్య పోటీగా రోజుకు 20 కోడి పందేలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. వీటికి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖులు నేతృత్వం వహిస్తున్నట్లు తెలిసింది. పందెం గెలిచిన వారికి వెండి నాణెం బహుమతిగా ఇస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే 60 కోడి పందేల్లో ఏ జిల్లా ఎక్కువగా గెలుస్తుందో వారికి ఇన్నోవా కారును బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. 

ఎక్కువ పందేలు గెలిచిన వారికి ఇన్నోవా కారు 
పశ్చిమగోదావరి జిల్లాలో వర్షం పడుతుండటంతో బరులు, పందెం రాయుళ్ల కోసం నిర్వాహకులు రెయిన్‌ ప్రూఫ్‌ టెంట్లు వేశారు. భీమవరం, సీసలి వంటి ప్రాంతాల్లో డిజిటల్‌ తెరలు ఏర్పాట్లు చేశారు. ఈసారి పందేలలో సెల్‌ఫోన్లు కీలక పాత్ర పోషించాయి. విశాలమైన బరులు ఏర్పాటు చేసిన చోట.. డ్రోన్ల ద్వారా చిత్రీకరిస్తూ వాటిని సెల్‌ఫోన్లలో షేర్‌ చేసుకొని ఎక్కడివారక్కడే పందేలు వేసుకున్నారు. పందెం డబ్బులు పేటీఎంల ద్వారా చెల్లించుకున్నారు. కోడి పందేలు చూసేందుకు, ఆడేందుకు వచ్చిన వారితో తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లోని లాడ్జీలు నిండిపోయాయి. రాత్రిళ్లు కూడా జూదం నిర్వహించేందుకు వీలుగా బరుల వద్ద ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు.

ఆత్రేయపురంలో స్తంభించిన ట్రాఫిక్‌..
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో కోడి పందేల నేపథ్యంలో రహదారులపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆత్రేయపురం మండలం పేరవరం వద్ద రావులపాలెం - బొబ్బర్లంక రహదారి పక్కన కోడి పందేలు ఏర్పాటు చేయడంతో చూసేందుకు వచ్చిన జనం వారి వాహనాలు రోడ్డుపైనే నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. ఇంత జరుగుతున్న పోలీసులు కనీసం ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు కూడా చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని