
అధికారుల జోక్యంతో ఆ గర్భిణి అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: పలు కార్పొరేట్ ఆస్పత్రుల తీరుతో మల్లాపూర్‌కు చెందిన నిండు గర్భిణి పావని అంబులెన్స్‌లోనే మృతిచెందిన ఘటన అందరినీ కలచివేసిన విషయం తెలిసిందే. నగరంలోని ఐదు ఆస్పత్రులకు తిరిగి ఐదు గంటలుగా అంబులెన్స్‌లోనే కొట్టుమిట్టాడినా కార్పొరేట్ ఆస్పత్రులు స్పందించకపోవడంతో రెండు ప్రాణాలూ గాల్లో కలిసిపోయాయి. అయితే, నిండు గర్భిణి కావడంతో అంత్యక్రియలు చేసేందుకు శశ్మాన నిర్వాహకులు ముందుకు రాలేదు. తల్లిని బిడ్డను వేరు చేస్తేగానీ దహనం చేయడం కుదరదని చెప్పారు. దీంతో ఐదు ఆస్పత్రుల్ని సంప్రదించగా, వారు శస్త్ర చికిత్స చేయడం కుదరదని చేతులెత్తేశారు. దిక్కుతోచని స్థితిలో మృతదేహాన్ని ఇంటికే తీసుకెళ్లారు. ఓవైపు పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ఇది మరింత వేదన మిగిల్చింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు పావని అంత్యక్రియలకు తగిన ఏర్పాట్లు చేశారు. మల్లాపూర్‌లోని వైకుంఠధామం నిర్వాహకులతో మాట్లాడారు. దీంతో పావనికి ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు ఈ హృదయవిదారక ఘటనపై మేడ్చల్ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ శ్వేతా మహంతి విచారణకు ఆదేశించారు. దీంతో డీఎంహెచ్‌వో మల్లిఖార్జున్ మృతురాలు పావని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. గర్భిణి కుటుంబ సభ్యుల నుంచి మృతికి సంబంధించిన పలు వివరాలను సేకరించారు.