Junmoni Rabha: రోడ్డు ప్రమాదంలో.. అస్సాం ‘లేడీ సింగం’ దుర్మరణం

పోలీస్‌ విభాగంలో లేడీ సింగంగా పేరొందిన అస్సాంకు చెందిన మహిళా పోలీస్‌ అధికారి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

Published : 16 May 2023 21:46 IST

నాగాన్‌: అస్సాం పోలీస్‌ విభాగంలో ‘లేడీ సింగం’గా పేరొందిన మహిళా పోలీస్‌ అధికారి జున్‌మోనీ రాభా (Junmoni Rabha) ఇక లేరు. నాగాన్‌ జిల్లాలో పలు వివాదాల్లో చిక్కుకున్న ఆ మహిళా ఎస్సై.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

మోరికొలాంగ్‌ పోలీస్‌ ఔట్‌పోస్టు ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఎస్‌ఐ జున్‌మోనీ రాభా.. సోమవారం అర్థరాత్రి తన ప్రైవేటు కారులో ప్రయాణిస్తున్నారు. అర్థరాత్రి 2.30గంటల ప్రాంతంలో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వస్తున్న ఓ కంటైనర్‌ వాహనాన్ని రాభా కారు ఢీకొట్టింది. జాఖలాబంధా స్టేషన్‌ పరిధిలోని సరుభుగియా గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అందులో ఉన్న జున్‌మోనీని ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, సివిల్‌ దుస్తుల్లో ఉన్న ఆమె.. ఆ సమయంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారన్న విషయం తెలియరాలేదని జిల్లా ఎస్పీ వెల్లడించారు.

అస్సాం పోలీసు విభాగానికి చెందిన జున్‌మోనీ రాభా.. నాగాన్‌ జిల్లాలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించేవారు. విధుల్లో కఠినంగా వ్యవహరించే ఆమె.. తనదైన పనితీరుతో ఆ ప్రాంతంలో ‘లేడీ సింగం’, ‘దబాంగ్‌ పోలీస్‌’గా పేరు తెచ్చుకున్నారు. ఇదే సమయంలో ఆమె పలు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. అవినీతి ఆరోపణలపై గతేడాది జూన్‌లో అరెస్టైన ఆమె.. కొంతకాలం సస్పెన్షన్‌లో ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో తిరిగి ఆమె విధుల్లో చేరారు. అంతేకాకుండా ఓ భాజపా ఎమ్మెల్యేతో జరిపిన టెలిఫోన్‌ సంభాషణ కూడా వివాదాస్పదమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని