తెలంగాణలో నేరాలు..ఘోరాలు@ 2020

ఒక హత్యను కప్పిపుచ్చుకోడానికి 9 హత్యలు చేశాడో కర్కశుడు..

Updated : 29 Jun 2023 15:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఒక హత్యను కప్పిపుచ్చుకోడానికి 9 హత్యలు చేశాడో కర్కశుడు.. డబ్బు కోసం కన్నతల్లికి, తోడబుట్టిన చెల్లికి విషం పెట్టి చంపాడో దుర్మార్గుడు.. ఓ మహిళ వివాహేతర సంబంధానికి ముక్కపచ్చలారని చిన్నారి, ఆమె భర్త ప్రాణాలు కోల్పోయారు.. పరువు హత్యకు మరో ప్రేమికుడు బలైపోయాడు. ఆన్‌లైన్‌ జూదం, రుణ యాప్‌ల విష వలయంలో చిక్కి ఎందరో బాధితులు విలవిల్లాడిపోయారు. కాలగర్భంలో కలిసిపోతున్న 2020 ఏడాది ఎన్నో సంచలన నేరాలకు, క్రూర ఘటనలకు సాక్షిగా నిలిచింది.

వరంగల్‌లో తొమ్మిది హత్యలు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది పలు నేరాలు సంచలనం సృష్టించాయి. మే నెలలో వరంగల్‌ శివారులోని గొర్లెకుంట బావిలో తొమ్మిది శవాలు బయటపడిన కేసు కలకలం రేపింది. ఒక హత్యను కప్పి పుచ్చుకోడానికి నిందితుడు సంజయ్‌ చేసిన తొమ్మిది హత్యలు ఉలిక్కిపడేలా చేశాయి. 72 గంటల్లోనే కేసును చేధించిన వరంగల్‌ పోలీసులు.. మృతుల కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేల్చారు. వరంగల్‌కు చెందిన మక్సూద్‌ వదిన కూతురు రఫీకాతో సహ జీవనం చేసిన సంజయ్‌.. పెళ్లి చేసుకోమన్నందుకు ఆమెను హత్య చేశాడు. రఫికా గురించి ప్రశ్నిస్తున్నారని వాళ్ల కుటుంబాన్ని హతమార్చాడు. నేరం బయట పడుతుందని పక్క గదిలోనే ఉంటున్న బిహార్‌ యువకులను సైతం కడతేర్చాడు. ఈ కేసులో నిందితుడికి వరంగల్‌ కోర్టు మరణశిక్ష విధించింది. 

తొమ్మిదేళ్ల బాలుడు కిడ్నాప్‌.. హత్య

అక్టోబరులో మహబూబాబాద్‌లో అపహరణకు గురైన తొమ్మిదేళ్ల బాలుడి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. డబ్బుల కోసం పక్కింటి వ్యక్తే కిరాతకంగా హతమార్చాడు. త్వరగా ధనవంతుడు అవ్వాలనే నిందితుడి అత్యాశ కన్నపేగును కడసారి చూపునకు సైతం నోచుకోకుండా చేసింది. డబ్బులు తీసుకున్నా దొరికిపోతాననే భయంతోనే  కిడ్నాపర్‌ కిరాతకంగా బాలుడిని కడతేర్చాడు. కిడ్నాప్‌ చేసిన తర్వాత గంట వ్యవధిలోనే చిన్నారిని గొంతు నులిమి దారుణంగా చంపేశాడు. బాలుడిని చంపిన తర్వాత రెండు రోజుల పాటు డబ్బుల కోసం నిందితుడు సాగర్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ కాల్స్ చేస్తూనే ఉన్నాడు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఐదు రోజుల పాటు శ్రమించి పోలీసులు కేసు ఛేదించారు. 

వివాహేతర సంబంధం.. చిన్నారి హత్య.. తండ్రి ఆత్మహత్య

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో వివాహేతర సంబంధం ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసింది. పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న కల్యాణ్‌ భార్య, ఆరేళ్ల కుమార్తె ఆద్యతో కలిసి రాంపల్లిలో నివసించేవాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన కరుణాకర్‌ అనే వ్యక్తితో అతని భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. మరో వ్యక్తితోనూ సదరు మహిళ చనువుగా ఉండటంతో భరించలేని ఆమె ప్రియుడు కరుణాకర్‌ చిన్నారి ఆద్యను కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె హత్యకు గురికావడం, భార్య వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్తాపానికి గురైన కల్యాణ్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

మరో పరువు హత్య..

హైదరాబాద్‌లోని చందానగర్‌లో పరువు హత్య ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమ వివాహం చేసుకున్న హేమంత్‌, అవంతిక గచ్చిబౌలిలో నివసించేవారు. హేమంత్‌తో పెళ్లి ఇష్టంలేని అవంతిక తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ కలిసి సుపారి హత్యకు పథకం వేశారు. హేమంత్‌ను అపహరించి సంగారెడ్డి శివన్నగూడెం వద్ద దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. 

బుల్లితెర నటి శ్రావణి బలవన్మరణం..

ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కీలక మలుపులు తిరిగింది. వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. శ్రావణి ప్రియుడు దేవరాజ్‌, సన్నిహితుడు సాయికృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

తల్లి, చెల్లికి విషమిచ్చి..

మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌కు చెందిన సాయినాథ్‌రెడ్డి క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడి డబ్బు కోసం తల్లిని, చెల్లిని కడతేర్చాడు. తండ్రి మరణించగా వచ్చిన సొమ్ము, వ్యవసాయ పొలం అమ్మగా వచ్చిన డబ్బు మొత్తం కలిపి రూ.20 లక్షలు బ్యాంకులో జమ చేశారు. సాయినాథరెడ్డి క్రికెట్ బెట్టింగ్‌లలో రూ.12 లక్షల దాకా కోల్పోయాడు. డబ్బు గురించి ప్రశ్నించారని తల్లి, చెల్లికి ఆహారంలో పురుగుల మందు కలిపి ఇచ్చాడు. అది తిన్న ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 

కీసర తహసీల్దారు లంచం.. రూ.కోటీ పది లక్షలు

మేడ్చల్‌ జిల్లా కీసర తహసీల్దార్‌ నాగరాజు రూ.కోటీ పది లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టబడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివాదాస్పద భూమి విషయంలో స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించేందుకు నాగరాజు భారీగా లంచం తీసుకున్నారు. రిమాండ్‌లో భాగంగా చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయన అక్టోబరు 14న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ధర్మారెడ్డి కూడా బలవన్మరణం చెందడం సంచలనం సృష్టించింది. 

నేపాల్‌ దొంగల వరుస చోరీలు..

నమ్మకంగా పనిచేసి అదును చూసి వరుస చోరీలతో నేపాల్‌ దొంగలు చేలరేగిపోయారు. అక్టోబరు 5న రాయదుర్గం ఠాణా పరిధిలోని బీఎన్‌ రెడ్డి హిల్స్‌లో మధుసూదన్‌ అనే వ్యాపారి ఇంట్లో  పనిచేసే నలుగురు వ్యక్తులు ఇంట్లో ఉన్నవారికి ఆహారంలో మత్తు మందు కలిపి రూ.23 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. నాచారంలో ప్రదీప్‌కుమార్‌ అనే వ్యక్తి వద్ద పని చేసే నేపాల్‌ దొంగలు ఆ ఇంట్లోని వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి రూ.10లక్షలు నగదు సహా, భారీగా బంగారం.. వెండీ కాజేసి ఉడాయించారు. ఫిబ్రవరిలో నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వృద్ధ దంపతులను తాళ్లతో కట్టేసి దోచుకొని వెళ్లారు. సైనిక్‌పురిలోని నరసింహారెడ్డి అనే వ్యాపారి శుభకార్యానికి వెళ్లగా ఇళ్లు గుళ్ల చేసి రూ.రెండు కోట్లు విలువ చేసే బంగారంతో పారిపోయారు. 

ఆన్‌లైన్‌ జూదం.. రుణ యాప్‌లు

ఆన్‌లైన్‌ జూదం ద్వారా చైనాకు చెందిన యాన్‌హు రూ.1500కోట్లు మోసం చేశాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ అతడి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. ఏడాడి చివర్లో రుణయాప్‌లు సంచలనం సృష్టించాయి. హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, మెదక్‌లో ఓ యువకుడు, సిద్దిపేటలో ఓ ప్రభుత్వ ఉద్యోగిని రుణయాప్‌ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. రుణ యాప్‌ల వెనక కూడా చైనీయుల హస్తం ఉన్నట్లు సైబర్‌ క్రైం పోలీసుల దర్యాప్తులో తేలింది. 

ఇవీ చదవండి..
#2020:ఆనంద్‌ మహీంద్రా బెస్ట్‌ ట్వీట్స్‌ ఇవే..

ఏడాదంతా సవాళ్లతో ‘రణం’
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని