AP News: ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగి నలుగురిగల్లంతు

విశాఖ ఆర్‌కే బీచ్‌లో ఆదివారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. నలుగురు గల్లంతవ్వగా.. రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.

Updated : 02 Jan 2022 21:00 IST

పెద్దవాల్తేరు: విశాఖ ఆర్‌కే బీచ్‌లో ఆదివారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. నలుగురు గల్లంతవ్వగా.. రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీనికి సంబంధించి మూడో పట్టణ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ రసూల్‌పురాకు చెందిన 8 మంది యువకులు ఆదివారం మధ్యాహ్నం ఆర్‌కే బీచ్‌కు చేరుకొని స్నానానికి దిగారు.  పెద్ద కెరటాలు రావడంతో ఇందులో ముగ్గురు యువకులు నీట మునిగారు. కొద్దిసేపటికే సీహెచ్‌ శివను లైఫ్‌ గార్డ్స్‌ ఒడ్డుకు తీసుకొచ్చారు. కొన ఊపిరితో ఉన్న అతన్ని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు. గల్లంతైన కె.శివ, మహ్మద్ అజీజ్ కోసం గాలింపు చేపట్టారు.

ఒడిశాలోని భద్రక్‌ జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థులు మధ్యాహ్నం ఆర్‌కే బీచ్‌కు చేరుకున్నారు. ఈ ఐదుగురు స్నానం చేయడానికి సముద్రంలో దిగారు. పెద్ద కెరటం నెట్టడంతో విద్యార్థిని సుమిత్రా త్రిపాఠి నీటమునిగింది. కొద్దిసేపటికే శవమై ఒడ్డుకు చేరింది. మిగిలిన నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన ఇద్దరు హైదరాబాద్‌ యువకుల కోసం గజ ఈతగాళ్లు, లైఫ్‌ గార్డ్స్‌ గాలింపు చర్యలు చేపట్టారు. మూడో పట్టణ సీఐ కోరాడ రామారావు నేవీ, మెరైన్‌ సిబ్బందికి సమాచారం అందజేశారు. స్పీడ్‌ బోట్లు, హెలికాప్టర్‌ ద్వారా గాలించే అవకాశం ఉంది. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని