Crime News: ఫేస్‌బుక్‌ ప్రేమాయణం.. పెళ్లి పేరిట కోటి స్వాహా

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమై.. ప్రేమ, పెళ్లి పేరిట ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నుంచి రూ.కోటి వసూలు చేసిన కిలాడి దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌లో ఉంటున్న ఓ

Updated : 24 Nov 2021 05:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమై.. ప్రేమ, పెళ్లి పేరిట ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నుంచి రూ.కోటి వసూలు చేసిన కిలాడి దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌లో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు గుంటూరు జిల్లాకు చెందిన యర్రగుడ్ల దాసు, జ్యోతిలు.. కల్యాణిశ్రీ పేరుతో ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యారు. ఏడాదిన్నరపాటు ప్రేమాయణం నడిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. చేబదులు.. ఇతర ఖర్చులంటూ దశల వారీగా రూ.కోటి కాజేశారు. మోసపోయానని గ్రహించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి గుంటూరు జిల్లా సత్తెనపల్లికి వెళ్లి నిందితులను పట్టుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మంగళవారం కోర్టులో హాజరుపరిచి, జైలుకు తరలించారు.

సందేశాలు మాత్రమే..: బహుళజాతి సంస్థలో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు నలభై ఏళ్లు వస్తున్నా పెళ్లి కాలేదు. ఏడాదిన్నర క్రితం యర్రగుడ్ల దాసు.. కల్యాణిశ్రీ పేరుతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచమయ్యాడు. విజయవాడలో ఉంటున్నానని, సంప్రదాయ కుటుంబమని చెప్పాడు. తర్వాత ప్రేమిస్తున్నానని తెలిపాడు. ఫోన్‌ చేయవద్దని, విజయవాడకు రావొద్దని షరతు విధించాడు. కేవలం చాటింగ్‌ ద్వారానే మాట్లాడదామని వివరించాడు. దాసును నిజంగానే కల్యాణిశ్రీ అనుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. తానూ ప్రేమిస్తున్నానని, ఇష్టమైతే పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించాడు. ఒక్కసారి కలుద్దాం అంటూ కోరగా.. పెళ్లి సంబంధం మధుసూదన్‌ అనే వ్యక్తితో మాట్లాడాలంటూ ఒక ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు. మధుసూదన్‌లా కూడా దాసే నటించాడు. ఖర్చులు, ఇతర అవసరాల పేరుతో జూన్‌ 2020 నుంచి అక్టోబరు 2021 వరకు రూ.కోటి కాజేశాడు. పెళ్లి పేరుతో మోసం చేసిన దాసు నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి. ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేశాడు. ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతూ విధులు మర్చిపోవడంతో సంస్థ ఉద్యోగంలోంచి తొలగించింది. బెట్టింగ్‌లకు బానిసై మోసానికి పాల్పడ్డాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని