Vizianagaram: యూట్యూబ్‌లో చూసి.. పెళ్లయిన 3 నెలలకే భార్యను హతమార్చిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌

కట్టుకున్న భార్యపై అనుమానంతో పెళ్లయిన మూడు నెలలకే పథకం ప్రకారం హతమార్చిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

Published : 23 Jun 2024 06:35 IST

గజపతినగరం: కట్టుకున్న భార్యపై అనుమానంతో పెళ్లయిన మూడు నెలలకే పథకం ప్రకారం హతమార్చి.. ఆ నేరం మరొకరిపై మోపేందుకు ప్రయత్నించిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు శనివారం మీడియాకు వెల్లడించారు. ‘‘విజయనగరం జిల్లా బంగారమ్మపేట గ్రామానికి చెందిన తాడుతూరి అనూష (22)ను జూన్‌ 16న రాత్రి 11 గంటల సమయంలో భర్త నక్కా జగదీష్‌(30) నైలాన్‌ తాడు మెడకు బిగించి హతమార్చాడు. అనంతరం.. గతంలో ఉన్న పరిచయాలతో ప్రసాద్‌ వేధిస్తున్నాడని, అందుకే చనిపోతున్నానని ఆమె చరవాణి నుంచి అనూష తండ్రి, అన్న, స్నేహితురాలు, భర్త(జగదీష్‌)కు సంక్షిప్త సందేశాలు పంపాడు.

దీంతో ఆందోళనకు గురైన మృతురాలి కుటుంబ సభ్యులు ప్రసాద్‌ ఇంటిపై దాడికి వెళ్లారు. వారు డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో వెంటనే ఎస్‌ఐ మహేశ్‌ సిబ్బందితో గ్రామానికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు. ఇంటికి కొంత దూరంలో పశువులపాక వద్ద అనూష మృతదేహం పడి ఉంది. వెంటనే పోలీసులు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతురాలికి ప్రసాద్‌కు మధ్య ఏడాదిగా ఎలాంటి కాల్‌ సంభాషణలు లేకపోవడాన్ని గుర్తించారు. మృతురాలు పంపిన మెసేజ్‌లు ఓకేసారి నలుగురికి ఎలా వెళ్లాయనే కోణంలో ఆరా తీశారు. ఆ దిశగా భర్తను విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది.

వారం క్రితమే హత్యకు పథకం..

తనకు ఇష్టం లేకుండానే బలవంతంగా పెళ్లి చేయడంతో అనూషను పుట్టింట్లోనే వదిలి ఉద్యోగానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. హత్య చేయడానికి వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చి భార్యను తీసుకుని విజయనగరం తదితర ప్రాంతాల్లో తిరిగాడు. ఉద్యోగం పనిపై వచ్చానని చెప్పి ఆమెను పుట్టింటికి పంపించేశాడు. అనంతరం విశాఖలో మకాం వేశాడు. అక్కడి నుంచి ఈనెల 16న రాత్రి బంగారమ్మపేట గ్రామానికి వచ్చి.. భార్యను ఇంట్లోంచి బయటకు రమ్మని పిలిచాడు. ఆమె ప్రవర్తనపై ప్రశ్నించగా.. కేకలు వేయడంతో అప్పటికే జేబులో ఉన్న నైలాన్ తాడును మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. అప్పటికే తన చరవాణిలో సిద్ధం చేసిన సంక్షిప్త సందేశాలను ఆమె ఫోన్‌లోకి కాపీ పేస్టు చేసి నలుగురికి ఒకేసారి పంపించాడు. పాత సెల్ ఫోన్‌ సిమ్ మూడు రోజుల క్రితం తీసేసి.. కొత్త సిమ్‌ కార్డు తనపేరుతో తీసుకున్నాడు. సాంకేతికతను ఉపయోగించి తన చేతికి మట్టి అంటకుండా హత్య చేయాలని పథకం వేశాడు. పట్టుబడకుండా నేరం ఎలా చేయాలనే దానిపై నిందితుడు యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసి తెలుసుకున్నాడు. జగదీష్‌ను శనివారం అరెస్టు చేశాం’’ అని డీఎస్పీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని