Credit card fraud: దిల్లీలో హై‘టెక్‌’ మోసం.. ధోనీ, అభిషేక్‌ పేరుతో క్రెడిట్‌ కార్డులు!

Credit card fraud in delhi: క్రికెటర్లు, సినీ ప్రముఖుల పాన్‌ కార్డు వివరాలతో దిల్లీలో హైటెక్‌ మోసానికి తెరతీశారు కేటుగాళ్లు. క్రెడిట్‌ కార్డులు తీసుకుని ఏకంగా రూ.50 లక్షల మోసానికి పాల్పడ్డారు. ఇందుకోసం నెలల పాటు ఆన్‌లైన్‌లో పరిశోధించారు.

Updated : 03 Mar 2023 14:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ రాజధాని దిల్లీలో ఘరానా మోసం వెలుగు చూసింది. క్రికెటర్లు, బాలీవుడ్‌ సెలబ్రిటీల వివరాలతో తప్పుడు పాన్‌ కార్డు (Pan card), ఆధార్‌ (Aadhaar) వివరాలతో క్రెడిట్‌ కార్డులు (Credit cards) పొంది ఏకంగా రూ.50 లక్షలకు టోకరా వేశారు. ఆన్‌లైన్‌లో వారి జీఎస్టీ ఐడెంటిఫికేషన్‌ నంబర్లు సంపాదించి.. ప్రముఖ ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ కంపెనీ వన్‌ కార్డు (One card) నుంచి క్రెడిట్‌ కార్డులు పొంది ఈ హైటెక్‌ మోసానికి తెరతీశారు. కంపెనీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. ఎంఎస్‌ ధోనీ, అభిషేక్‌ బచ్చన్‌, సోనమ్‌ కపూర్‌, సచిన్‌ తెందూల్కర్‌, సైఫ్‌ అలీఖాన్‌, అలియాభట్‌, శిల్పాశెట్టి, ఇమ్రాన్‌ హష్మీ తదితరుల సెలబ్రిటీల వివరాలు ఉన్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

వివరాలు సంపాదించారిలా..

ఈ మోసానికి పాల్పడేందుకు కేటుగాళ్లు ముందు సెలబ్రిటీల జీఎస్టీ వివరాలను గూగుల్‌లో సంపాదించారు. సాధారణంగా జీఎస్టీఐఎన్‌లో (GSTIN) ఉండే తొలి రెండు అంకెలు స్టేట్‌ కోడ్‌ను సూచిస్తాయి. మిగిలిన 10 అంకెల్లో పాన్‌ నంబర్‌ ఉంటుంది. సెల్రబిటీలకు సంబంధించి పుట్టిన తేదీ వివరాలన్నీ గూగుల్‌లో లభించడంతో వీరి పని సులువు అయ్యింది. పుట్టిన తేదీ, పాన్‌ వివరాలు లభించడంతో వీరు కొత్త పాన్‌ కార్డుకు వారి వ్యక్తిగత చిత్రాలతో అప్లయ్‌ చేశారు. వీడియో వెరిఫికేషన్‌ సమయంలో పాన్‌/ ఆధార్‌ వివరాలు వీరి చిత్రాలు సరిపోలే విధంగా జాగ్రత్త పడ్డారు. అభిషేక్‌ బచ్చన్‌ను ఉదాహరణగా తీసుకుంటే.. పాన్‌ కార్డు వివరాలు ఆయనవి ఉంటాయి. చిత్రం మాత్రం మోసగాడివి ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ఇదే పద్ధతిని ఆధార్‌ వివరాలు పొందేందుకూ వినియోగించారు. ఈ రెండూ దొరికాక వన్‌ కార్డు నుంచి క్రెడిట్‌ కార్డు కోసం అప్లయ్‌ చేశారు.

రెండు నెలల పరిశోధన

వీడియో వెరిఫికేషన్‌ సమయంలో ఏమాత్రం తొట్రపాటు లేకుండా ఈ కేటుగాళ్లు సమాధానం ఇచ్చారు. అప్పటికే సెలబ్రిటీల తాలుకా ఆర్థిక కార్యకలాపాల వివరాలు వారు సంపాదించుకుని పెట్టుకున్నారు. అసలు క్రెడిట్‌ కార్డుల జారీ, ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌లో ఉన్న లోపాల గురించి కొన్ని నెలల పాటు పరిశోధించారు. వీడియో వెరిఫికేషన్‌ కంటే ముందు క్రెడిట్‌ కార్డు కోసం యాప్‌లో పాన్‌, ఆధార్‌ వివరాలను తమ యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసినట్లు సదరు సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. అసలు పాన్‌ కార్డు, ఆధార్‌ వివరాల స్థానే నకిలీ పాన్‌, ఆధార్‌ వివరాలు ఇచ్చారని ఆ కంపెనీ పేర్కొంది. నకిలీ గుర్తింపుతో దరఖాస్తు చేసినప్పటికీ.. బ్యూరో వద్ద ఉన్న పాన్‌, క్రెడిట్‌ లిమిట్‌ వివరాల ఆధారంగా ఒక్కో క్రెడిట్‌ కార్డుకు రూ.10 లక్షల లిమిట్‌ చొప్పున జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది. కేవలం ఫిజికల్‌ కార్డుతోనే కాకుండా.. వన్‌కార్డు, వన్‌ స్కోరు యాప్‌ ద్వారా కూడా వర్చువల్‌ క్రెడిట్‌ కార్డును ఆన్‌లైన్‌, యాప్‌ ఆధారిత లావాదేవీలకు వినియోగించే సదుపాయం ఉండడంతో కేటుగాళ్ల పని సులువు అయ్యింది. కేటుగాళ్లు పేర్కొన్న అడ్రస్‌లకు కొన్ని ఫిజికల్‌ కార్డులను సైతం పంపించినట్లు కంపెనీ పేర్కొంది.

ఫిర్యాదుతో వెలుగులోకి..

లక్షల్లో క్రెడిట్‌ లిమిట్‌ పొందిన మోసగాళ్లు ఆ మొత్తాన్ని వారం వ్యవధిలోనే వినియోగించారు. పైగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని వన్‌కార్డు తన ఫిర్యాదులో పేర్కొంది. ఒకే డివైజ్‌ నుంచి బహుళ దరఖాస్తులు రావడంతో తమ వ్యవస్థ గుర్తించి అలర్ట్‌ చేసిందని ఫిర్యాదులో తెలిపింది. ఈ విధంగా 7 వేర్వేరు డివైజుల నుంచి 83 నకిలీ పాన్‌ కార్డు వివరాలతో ప్రయత్నించారని పేర్కొంది. మోసాన్ని గుర్తించిన వెంటనే వన్‌కార్డు సంస్థ దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పునీత్‌, మహ్మద్‌ అసిఫ్‌, సునీల్‌ కుమార్‌, పంకజ్‌ మిశార్‌, విశ్వభాస్కర శర్మను నిందితులుగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని