Dalit Boy Death: 23రోజుల్లో 6 ఆస్పత్రులు తిప్పినా.. దక్కని బాలుడి ప్రాణం

టీచర్‌ చేతిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని 23 రోజుల్లో ఆరు ఆస్పత్రుల్లో చూపించినప్పటికీ ఫలితం దక్కలేదని పోలీసులు ఆ నివేదికలో పేర్కొన్నారు.

Published : 18 Aug 2022 02:12 IST

రాజస్థాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోన్న దళిత బాలుడి మృతి

జైపుర్‌: రాజస్థాన్‌లో తాగునీటి కుండను తాకినందుకు టీచర్‌ తీవ్రంగా కొట్టడంతో ఓ దళిత బాలుడు (Dalit Boy) మృత్యువాతపడిన దారుణ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్‌ (NCSC) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక నివేదికను రాష్ట్ర(Rajasthan) సామాజిక న్యాయశాఖ అధికారులు జాతీయ ఎస్సీ కమిషన్‌కు అందించారు. టీచర్‌ చేతిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని 23 రోజుల్లో ఆరు ఆస్పత్రుల్లో చూపించినప్పటికీ ఫలితం దక్కలేదని పోలీసులు ఆ నివేదికలో పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని జాలోర్‌ జిల్లా సురానా గ్రామంలోని ఓ పాఠశాలలో జరిగిన ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా పలు వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

పోలీసులు నివేదిక ప్రకారం, ఇంద్రా మేఘావాల్‌ (9) అనే విద్యార్థికి తీవ్రంగా దప్పిక వేయడంతో ఉపాధ్యాయుల కోసం ఉంచిన కుండలోని నీటిని తాగేందుకు ప్రయత్నించాడు. అది చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన చైల్‌ సింగ్‌ (45) అనే ఉపాధ్యాయుడు.. ఆ విద్యార్థిని చితకబాదాడు. దాంతో విద్యార్థి కిందపడిపోవడంతోపాటు చెవుల నుంచి రక్తస్రావం కావడం మొదలయ్యింది. ఈ విషయాన్ని పాఠశాల ముందే రిపేర్‌ షాపు నిర్వహిస్తున్న తన తండ్రి దేవారామ్‌ మేఘావాల్‌కి చెప్పిన విద్యార్థి.. చెవినొప్పి తీవ్రంగా ఉందని పేర్కొన్నాడు. కుమారుడి బాధను చూసిన దేవారామ్‌ తొలుత బగోడాలోని బజరంగ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించాడు. చికిత్స తీసుకున్న అనంతరం రెండు రోజులకు చెవి నొప్పి మళ్లీ తీవ్రమవడంతో భీన్‌మల్‌లోని ఆస్థా మల్టీస్పెషాలిటీ (రెండో) ఆస్పత్రిలో చేర్పించారు.

23 రోజుల్లో ఆరు ఆస్పత్రులు..

అక్కడ చికిత్స తీసుకున్నా నొప్పి తగ్గకపోవడంతో అదే పట్టణంలోని త్రివేణి మల్టీ స్పెషాలిటీ ట్రామా (మూడో ఆస్పత్రి) కేంద్రంలో చూపించారు. రెండు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత కూడా చెవి నొప్పిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో గుజరాత్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో గుజరాత్‌లోని దీసా పట్టణంలో ఉన్న కర్ణీ ఆస్పత్రికి (నాలుగో ఆస్పత్రి) తీసుకెళ్లి అక్కడా ఒకరోజు చికిత్స చేయించారు. మళ్లీ త్రివేణీ ఆస్పత్రి వచ్చి.. అక్కడ నుంచి మరో న్యూరో సెంటర్‌లో (ఐదో ఆస్పత్రి) చూపించారు. అక్కడ ఆరు రోజులు చికిత్స తీసుకున్నా తగ్గకపోవడంతో చివరకు ఉదయ్‌పుర్‌లోని గీతాంజలి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వారు అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి (ఆరో ఆస్పత్రి) సిఫార్సు చేశారు.

ఇలా దాదాపు 23 రోజుల్లో ఆరు ఆస్పత్రుల్లో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికీ నొప్పి తీవ్రత మరింత ఎక్కువ కావడం, బాలుడి ఆరోగ్యం క్షీణించడంతో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 13న ప్రాణాలు కోల్పోయాడు. ఇది చూస్తుంటే, బాలుడు పరిస్థితి విషమంగా ఉండడంతోనే ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి వైద్యులు సిఫార్సు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోందని జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ విజయ్‌ సాంప్లా పేర్కొన్నారు. ఇది కేవలం ఒకేదెబ్బ కొట్టడం వల్ల జరగలేదని అభిప్రాయపడిన ఆయన.. వాస్తవంగా ఏం జరిగిందనే విషయంపై పూర్తి నివేదిక అందించాలని రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించారు. వెనుకబడిన కులాల వారిపై వివక్ష చూపించే ఇటువంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు గతంలోనూ చూశామన్న కమిషన్‌.. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. మరోవైపు ఈ దారుణోదంతంపై రాష్ట్ర ప్రభుత్వానికి తాఖీదు జారీ చేసిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (NCPCR).. బాలుడి మరణానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts