దారుణం: అదనపు వడ్డీ కోసం.. మహిళను వివస్త్రను చేసి.. నోట్లో మూత్రం పోయించి..!

Woman stripped, urinated: అదనపు వడ్డీ చెల్లించలేదని ఓ మహిళను వివస్త్రను చేసి, ఆమె నోట్లో మూత్రం పోయించిన దారుణ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.

Updated : 25 Sep 2023 18:46 IST

పట్నా: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించినా అదనపు వడ్డీ ఇవ్వలేదని దళిత మహిళపై ఓ వ్యక్తి అత్యంత అమానవీయంగా ప్రవర్తించాడు. ఆమెను వివస్త్రను చేసి దాడి చేశాడు. ఆమె నోట్లో మూత్రం పోయించాడు. ఈ అమానుష ఘటన బిహార్‌ రాజధాని పట్నాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

పట్నా జిల్లా మోసిమ్‌పుర్‌ గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త.. స్థానికంగా పలుకుబడి ఉన్న ప్రమోద్‌ సింగ్‌ వద్ద కొన్ని నెలల క్రితం రూ.1500 అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా.. అదనపు వడ్డీ ఇవ్వాల్సిందేనని ప్రమోద్‌ సింగ్‌ డిమాండ్ చేశాడు. అందుకు వారు అంగీకరించలేదు. దీంతో ఆ దంపతులపై కోపం పెంచుకున్న ప్రమోద్‌.. గతవారం సదరు మహిళకు ఫోన్‌ చేసి బెదిరించాడు. అదనపు వడ్డీ ఇవ్వకపోతే గ్రామంలో నగ్నంగా ఊరేగిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిమజ్జనానికి ముందుగా వెళ్లారని దళితులపై దాడి.. వైకాపా నాయకుల ప్రోద్బలంతో..

ఈ విషయం తెలుసుకున్న ప్రమోద్‌ గత శనివారం రాత్రి అతడి అనుచరులతో కలిసి మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి ఆమెపై దాడి చేశాడు. మహిళను వివస్త్రను చేసి కర్రలతో కొట్టించాడు. అక్కడితో ఆగకుండా తన కుమారుడితో మహిళ నోట్లో మూత్రం పోయించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితులైన ప్రమోద్‌ సింగ్‌, అతడి కుమారుడు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. బాధిత మహిళ ప్రస్తుతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని