Madanapalle: దారితప్పిన కూతురు... తండ్రిపాలిట మృత్యువు

తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటున్నారన్న కోపంతో కన్నతండ్రిపైనే దాడి చేసి కడతేర్చిందా కుమార్తె. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ నెల 13న జరిగిన హత్య కేసు వివరాలను డీఎస్పీ ప్రసాదరెడ్డి సోమవారం వెల్లడించారు.

Updated : 18 Jun 2024 09:14 IST

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటున్నారన్న కోపంతో కన్నతండ్రిపైనే దాడి చేసి కడతేర్చిందా కుమార్తె. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ నెల 13న జరిగిన హత్య కేసు వివరాలను డీఎస్పీ ప్రసాదరెడ్డి సోమవారం వెల్లడించారు. మదనపల్లె పీఅండ్‌టీ కాలనీకి చెందిన దొరస్వామి (62) దిగువ కురవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్య లత ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో బీఎస్సీ, బీఈడీ చదివిన తమ ఏకైక కుమార్తె హరితతో కలిసి సొంతింట్లో ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం దాచిన మొత్తాన్ని ఆమె బ్యాంకు ఖాతాలోనే వేశారు. తల్లి నగలను సైతం అప్పగించారు. ఈ నేపథ్యంలో హరిత మదనపల్లెకు చెందిన రమేశ్‌తో సన్నిహితంగా ఉంటూ అతనికి తన బంగారు నగలు ఇచ్చింది. అతను వాటిని తాకట్టు పెట్టి రూ.11.40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. సాయికృష్ణ అనే మరో యువకుడికి రూ.8 లక్షలు ఇచ్చింది. ఈ ఇద్దరే కాకుండా హరీశ్‌రెడ్డితోనూ సన్నిహితంగా ఉంటోంది.

ఈ విషయాలు తెలుసుకున్న దొరస్వామి మంచి సంబంధం చూసి ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు హరిత నిరాకరించింది. ఈ విషయమై నెల రోజులుగా తండ్రి, కుమార్తెల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 13న క్షణికావేశానికి గురైన హరిత ఇంట్లోని చపాతీ కర్ర, పరీక్షలు రాసే అట్ట, తాళంకప్ప, కర్రతో విచక్షణా రహితంగా తండ్రి దొరస్వామి తలపై దాడి చేసింది. తీవ్రగాయాల పాలైన ఆయన మృతి చెందారని డీఎస్పీ తెలిపారు. హత్య జరిగిన రోజు అరుపులు విని చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా, దొరస్వామి రక్తపు మడుగులో పడి ఉన్నారు. తన తండ్రి కాలుజారి కింద పడటంతో గాయాలయ్యాయని హరిత వారికి చెప్పడం గమనార్హం. తరువాత పోలీసులకూ అదే విషయాన్ని తెలిపింది. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి హరితే హత్య చేసినట్లుగా నిర్ధారించారు. నిందితురాలిని సోమవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని