Shamshabad: బండరాయితో కొట్టి.. కారు కవర్లో చుట్టి.. అప్సర హత్య కేసులో కీలక వివరాలు

శంషాబాద్‌లో అప్సర అనే మహిళ హత్య కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని ప్రాథమికంగా తేలిందన్నారు.

Updated : 09 Jun 2023 20:51 IST

హైదరాబాద్‌: నగరంలో సంచలనం రేపిన అప్సర హత్య కేసుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధరించారు. వివరాలను శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు. ‘‘ఈ కేసులో నిందితుడు వెంకట సాయికృష్ణ, మరో మహిళతో కలిసి వచ్చి అప్సర కనిపించడం లేదని శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమెను ఈ నెల మూడో తేదీన భద్రాచలం వెళ్లేందుకు వాహనం ఎక్కించామని ఆ తర్వాత ఆమె నుంచి స్పందన లేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సాయికృష్ణతోపాటు వచ్చిన మహిళ అప్సర తల్లి అని గుర్తించాం. ఫిర్యాదు సమయంలో వారిద్దరి వ్యాఖ్యలకు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చింది. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా.. సాయికృష్ణ, అప్సర కారులో నర్కుడ వైపు వెళ్లినట్టు తెలిసింది.’’ అని నారాయణరెడ్డి మీడియాకు తెలిపారు.

ముందు సీట్లో అప్సర నిద్రించిన సమయంలో కారుకు కప్పే కవర్‌తో ఆమెకు ఊపిరాడకుండా చేసి హత్య చేసేందుకు సాయికృష్ణ ప్రయత్నించినట్లు చెప్పారు.‘‘ ఆమె ఎదురు తిరగడంతో రాయితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన తర్వాత శవాన్ని కారుకు కప్పే కవర్లో చుట్టేసి డిక్కీలో కుక్కేశాడు. ఆమె మృతదేహాన్ని సరూర్‌నగర్‌కు తీసుకొచ్చి... స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మ్యాన్‌హోల్‌లో పడేశాడు. సరూర్‌నగర్‌ వద్ద సెప్టిక్ ట్యాంక్‌ సమీపంలో సాయి కృష్ణ మట్టి పోయించి అనుమానం రాకుండా వ్యవహరించాలని ప్రయత్నం చేశాడు’’ అని నారాయణరెడ్డి పేర్కొన్నారు.

సీరియల్‌లో నటించాలని వచ్చి..

సీరియల్‌లో నటించాలని చెన్నై నుంచి అప్సర హైదరాబాద్‌కు వచ్చినట్లు డీసీసీ నారాయణరెడ్డి  పేర్కొన్నారు. తన సోదరి వద్ద ఉంటూ ప్రయత్నాలు చేస్తుండేదని, ఈ క్రమంలో బంగారు మైసమ్మ ఆలయానికి వస్తుండగా పూజారి సాయికృష్ణతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. ఇది క్రమంగా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసిందన్నారు. ‘‘సాంకేతిక వివరాలు సీసీ కెమెరాలు దృశ్యాలు, మొబైల్‌ఫోన్‌లోని వివరాల ఆధారంగా హత్య కేసును చేధించాం. అప్సరను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే నిందితుడు సాయికృష్ణ అంతమొందించినట్లు ప్రాథమికంగా తేలింది. సాంకేతిక వివరాలను పరిశీలించగా.. అతడొక్కడే హత్యకు పాల్పడినట్లు తేలింది.’’ అని డీసీపీ తెలిపారు.

పక్కా ప్లాన్‌ ప్రకారమే అప్సరను హత్య చేసినట్లు నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆమె కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడన్నారు. ‘‘ అప్సర గతంలో గర్భం దాల్చింది. ఆమెకు అబార్షన్ కూడా అయిందని దర్యాప్తులో తేలింది. ఈ విషయంలో మరింత లోతుగా విచారణ జరుపుతున్నాం. నిందితుడుని పోలీస్‌ కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారణ చేస్తున్నాం. అప్సర కోయంబత్తూరు వెళ్తున్నట్టు తన ఇంట్లో చెప్పింది. ఆ తర్వాత సాయికృష్ణ ఆమెను శంషాబాద్ లోని పలు ప్రాంతాల్లో తిప్పి సుల్తాన్‌పుర్‌ తీసుకువచ్చి అంతమొందించినట్లు దర్యాప్తులో తేలింది’’ అని డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని