Temple Tragedy: ఆలయంలో మెట్లబావి ఘటన.. 35కి చేరిన మృతులు

Indore temple tragedy: మధ్యప్రదేశ్‌ ఆలయంలో చోటుచేసుకున్న మెట్లబావి దుర్ఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో మెట్లబావి పైకప్పు కూలి పదుల సంఖ్యలో భక్తులు అందులో పడిపోయిన విషయం తెలిసిందే.

Published : 31 Mar 2023 09:46 IST

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో నవమి వేడుక పెను విషాదాన్ని మిగిల్చింది. ఆలయంలో మెట్లబావి (Step Well) పైకప్పు కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. (Indore temple tragedy)

ఇండోర్‌ (Indore)లోని బేలేశ్వర్‌ మహదేవ్‌ ఝాలేలాల్ ఆలయంలో గురువారం శ్రీరామనవమి వేడుకల్లో ఈ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పటేల్‌ నగర్‌ ప్రాంతంలో ఉన్న ఈ పురాతన ఆలయంలో రామనవమి ఉత్సవాలకు పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో రద్దీ పెరిగింది. స్థలాభావం కారణంగా వేడుకలను చూసేందుకు కొందరు భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి (Stepwell) కప్పుపై కూర్చున్నారు. దీంతో బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయి ఘోరం జరిగింది. (Indore temple tragedy )

సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా బావిలో పడిపోయారు. 16 మందిని సహాయక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు 35 మంది మృతదేహాలను బావి నుంచి వెలికి తీశామని ఇండోర్‌ జిల్లా కలెక్టర్‌ డా. ఇళయరాజా మీడియాకు వెల్లడించారు. ఓ వ్యక్తి గల్లంతైనట్లు తెలిపారు. ఆ వ్యక్తి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఆలయం ఉన్న భూమిలో పురాతన కాలం నుంచి ఓ మెట్లబావి ఉంది. అయితే దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఆ బావిని మూసేశారు. అయితే జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం పైన శ్లాబుతో ఫ్లోరింగ్‌ చేసి.. ఆలయాన్ని నిర్మించారు. ఆ విషయం తెలియక చాలా మంది బావి ఉన్న ప్రాంతంలో కూర్చునేసరికి బరువు మోయలేక.. నేల కుంగిపోయి ఈ దుర్ఘటన చోటుచేసుకుందని స్థానిక అధికారులు వెల్లడించారు. బావి లోతు దాదాపు 50 అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని