Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. 278కి చేరిన మృతుల సంఖ్య

Odisha Train Tragedy: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో మృతుల సంఖ్య 278కి చేరింది. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.

Updated : 03 Jun 2023 11:33 IST

బాలేశ్వర్‌: ఒడిశా (Odisha) రాష్ట్రంలోని బాలేశ్వర్‌ జిల్లాలో రైలు పట్టాలపై సంభవించిన మృత్యుఘోషలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 278 మంది దుర్మరణం చెందినట్లు అధికారులు వెల్లడించారు. వందల మంది గాయపడగా.. వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. (Odisha Train Tragedy)

ఇప్పటికీ బోగీల కింద అనేక మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF), ఓడీఆర్‌ఎఫ్‌ ముమ్మరంగా గాలిస్తోంది. అటు భారత ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తంగా 1200 మంది సిబ్బంది ఈ సహాయకచర్యల్లో పాల్గొన్నారు.

ఒడిశాకు ప్రధాని మోదీ..

ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) నేడు సమీక్ష చేపట్టారు. రైల్వే శాఖ ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమైన ఆయన.. పరిస్థితిపై ఆరా తీశారు. మరోవైపు, ప్రధాని ఈ రోజు ఒడిశా రానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తొలుత బాలాసోర్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి ప్రధాని పరిశీలించనున్నారు. అనంతరం కటక్‌లోని ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్నట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిందిలా..

స్థానిక అధికారుల కథనం ప్రకారం- బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (Bengaluru-Howrah Superfast Express ) బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. వాటిని షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (Shalimar-Chennai Central Coromandel Express) ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదం అక్కడితో ఆగిపోలేదు. బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది. అయితే రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్‌ శర్మ కథనం మాత్రం మరోలా ఉండటం గమనార్హం. తొలుత కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిందని అమితాబ్‌ చెప్పారు. దాని 10-12 బోగీలు బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ రైలు మార్గంలో పడ్డాయని పేర్కొన్నారు. అనంతరం ఆ సూపర్‌ఫాస్ట్‌ బోగీలు పక్క ట్రాక్‌పై బోల్తాపడ్డాయని వివరించారు. ప్రయాణికుల రైళ్లు అతివేగంగా ప్రయాణించడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని