Republic day violence: దీప్‌ సిద్ధూకి మళ్లీ సమన్లు! 

పంజాబ్‌కు చెందిన నటుడు, ఉద్యమకారుడు దీప్‌ సిద్దూకి దిల్లీ హైకోర్టు మరోసారి సమన్లు జారీచేసింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌లో చోటుచేసుకున్న....

Published : 30 Jun 2021 01:04 IST

దిల్లీ:  పంజాబ్‌కు చెందిన నటుడు, ఉద్యమకారుడు దీప్‌ సిద్దూకి దిల్లీ హైకోర్టు మరోసారి సమన్లు జారీచేసింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌లో చోటుచేసుకున్న హింస ఘటనలో దీప్‌ సిద్దూతో పాటు మరికొందరికి కూడా సమన్లు ఇచ్చింది.  ఈ కేసులో నిందితులంతా జులై 12న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ఎదుట హాజరు కావాలని చీఫ్‌ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ గజేంద్రసింగ్‌ నాగర్‌ ఆదేశించారు. ఈ కేసులో దాఖలైన ఛార్జిషీట్‌ను ఈ నెల 19న పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితులు ఈ నెల 29న (మంగళవారం) విచారణకు హాజరు కావాలంటూ తొలుత సమన్లు జారీ చేశారు. అయితే, మంగళవారం హర్‌జోత్‌ సింగ్‌ అనే నిందితుడు ఒక్కరే న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరయ్యారు. దీప్‌ సిద్ధూ సహా ఎవరికీ ఇంకా సమన్లు అందలేదని వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో తాజాగా మరోసారి సమన్లు జారీచేసింది. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు దీప్ సిద్ధూనే కారణమని, రైతులు ఎర్రకోటవైపు వెళ్లేలా ఆయనే రెచ్చగొట్టారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో కుట్రదారుగా గుర్తించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేయగా.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని