Shraddha Murder: శ్రద్ధా వాకర్‌ హత్య.. ఐదు రకాల ఆయుధాలతో నరికేశాడు

స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిందన్న కోపంతోనే కాల్‌సెంటర్‌ ఉద్యోగిని శ్రద్ధా వాకర్‌ను ఆమె సహభాగస్వామి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు 6,629 పేజీల అభియోగ పత్రాన్ని సాకేత్‌ కోర్టుకు సమర్పించారు.

Published : 24 Jan 2023 18:22 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ (Shraddha Walkar) హత్య కేసులో దిల్లీ (Delhi) పోలీసులు మంగళవారం ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. స్నేహితుడ్ని కలవడానికి వెళ్లిందనే కోపంతోనే నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా (Aaftab Poonawala) ఆమెను హత్య చేసినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు 6,629 పేజీల అభియోగ పత్రాన్ని సాకేత్‌ కోర్టుకు సమర్పించారు. దాదాపు 150 మంది సాక్షుల నుంచి సేకరించిన వివరాలను పేర్కొన్నారు. శ్రద్ధా వాకర్‌ హత్యకు నిందితుడు ఐదు రకాల పదునైన ఆయుధాలను వినియోగించాడని, హత్య చేసిన తర్వాత రంపంతో మృతదేహాన్ని ముక్కలుగా కోసి గురుగ్రామ్‌, దక్షిణ దిల్లీలోని డంపింగ్‌ యార్డు ప్రాంతాల్లో విసిరేశాడని పోలీసులు ఛార్జిషీట్‌లో తెలిపారు.

 ‘‘ ఆమె  స్నేహితుడ్ని కలవడానికి వెళ్లడం నిందితుడికి నచ్చలేదు. ఆ విషయాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆగ్రహానికి గురై శ్రద్ధా వాకర్‌ను హత్య చేశాడు’’ అని అదనపు పోలీస్‌ కమిషనర్‌ మీను చౌదరి తెలిపారు. ఈ కేసును ఛేదించడానికి తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా సాక్ష్యాల కోసం కొన్ని బృందాలను హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్రకు  కూడా పంపించామన్నారు. శ్రద్ధా వాకర్‌ శరీర భాగాలను గుర్తించేందుకు చాలా సమయం పట్టిందని, దీనికోసం అధునాతన సాంకేతికతను వినియోగించామన్నారు. శ్రద్ధాను ఆమె సహజీవన భాగస్వామి ఆఫ్తాబ్‌ దారుణంగా చంపి, మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా కోసి శరీర భాగాలను దిల్లీ చుట్టుపక్కల పడేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్‌, ఎలక్ట్రానిక్‌ ఆధారాలు, వంద మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. నిందితుడు ఆఫ్తాబ్‌ నేరాంగీకార వాంగ్మూలం, నార్కో పరీక్షల నివేదికను జత చేసి ఈ ఛార్జిషీట్‌ను న్యాయస్థానానికి సమర్పించారు.

కొలిక్కి వచ్చినట్లేనా..?

ఈ హత్య కేసులో విచారణ ఓ కొలిక్కి వచ్చినట్లే కన్పిస్తోంది. ఆఫ్తాబ్‌ నుంచి సేకరించిన సమాచారం మేరకు పోలీసులు దక్షిణ దిల్లీలోని పలు చోట్ల నుంచి ఇప్పటికే 13 మానవ ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. వాటి డీఎన్‌ఏ శ్రద్ధా తండ్రి డీఎన్‌ఏతో సరిపోలింది. దీంతో శ్రద్ధా హత్యకు గురైందన్న విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. తానే ఈ నేరానికి పాల్పడినట్లు నిందితుడు ఇప్పటికే అంగీకరించాడు. దీంతో ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, నిందితుడు ఆఫ్తాబ్‌ జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు అతడిని కోర్టు ఎదుట హాజరుపర్చారు. అయితే అతడి కస్టడీని న్యాయస్థానం ఫిబ్రవరి 7వ తేదీ వరకు పొడిగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని