Triple Suicide: ఇంటిని గ్యాస్‌ ఛాంబర్‌గా మార్చి.. ఊపిరాడకుండా చేసుకొని..!

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ యాభైనాలుగేళ్ల మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 23 May 2022 01:40 IST

దిల్లీలో తల్లి సహా ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ యాభైనాలుగేళ్ల మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. , ఇంటిని మొత్తం గ్యాస్‌ ఛాంబర్‌గా మార్చి.. ఊపిరాడకుండా చేసుకొని మరణించడం ప్రతిఒక్కరిని కలచి వేస్తోంది. అంతేకాకుండా ఇంట్లోకి వచ్చిన వారు నిప్పు వెలిగించవద్దని.. అలా చేస్తే మరింత ప్రమాదం సంభవిస్తుందని అప్రమత్తం చేస్తూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొనడం సంచలనం కలిగిస్తోంది.

దక్షిణ దిల్లీలోని వసంత్‌ విహార్‌లో మంజు (54) అనే మహిళ ఇద్దరు కుమార్తెలు అన్షిక (27), అంకూ (25)లతో కలిసి నివాసం ఉంటోంది. మంజూ భర్త కొవిడ్‌ కారణంగా గతేడాదే ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి తీవ్ర కుంగుబాటులో ఉన్నట్లు సమాచారం. అయితే, శనివారం సాయంత్రం వరకూ మంజు ఇంటి నుంచి ఎవ్వరూ బయటకు రాకపోవడంతోపాటు లోపలి నుంచి తాళం వేసినట్లు గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ ఇంటి తలుపులు తెరచి లోనికి ప్రవేశించగా.. బెడ్‌రూమ్‌లో ముగ్గురు విగతజీవులుగా పడివున్నట్లు కనుగొన్నారు. వారి పక్కనే సూసైడ్‌ నోట్‌నూ గుర్తించారు. ఇంటి వాతావరణాన్ని పరిశీలించిన పోలీసులు.. ఇంటిని మొత్తం గ్యాస్‌ ఛాంబర్‌గా మార్చడం వల్ల ఊపిరాడకనే మరణించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారకు వచ్చారు.

నిప్పు రగిలించొద్దు..

సూసైడ్‌ నోట్‌ ప్రకారం.. తొలుత ఇంట్లోని కిటికీలను పాలిథిన్‌ కవర్‌తో ప్యాక్‌ చేశారు. అనంతరం గ్యాస్‌ సిలిండర్‌ను ఓపెన్‌ చేసి ఇంటిని మొత్తం గ్యాస్‌ ఛాంబర్‌గా మార్చారు. అంతేకాకుండా ‘చాలా ప్రమాదకర వాయువుతో ఇల్లు నిండివుంది. అగ్గిపుల్ల లేదా లైటర్‌ను వెలిగించవద్దు. ఇల్లు మొత్తం చాలా ప్రమాదకరమైన విషవాయువు (కార్బన్ మోనాక్సైడ్)తో నిండిపోయింది. ఈ వాయువును కూడా పీల్చవద్దు’ అని హెచ్చరిస్తూ లేఖలో పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఊపిరాడకపోవడంతోనే మంజు సహా ఇద్దరు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. గతేడాది తన భర్త మరణించడం, మంజు ఆరోగ్యం కూడా ఇటీవల సరిగా లేకపోవడం వంటి కారణాలు వారిని ఆత్మహత్యను ప్రేరేపించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని