Delhi Murder case: అది శ్రద్ధా తల కాదు.. అంజన్‌ది.. వెలుగులోకి మరో హత్య

శ్రద్ధావాకర్‌ హత్యకేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుకోకుండా మరో హత్య కేసును ఛేదించారు. మృతుడిని దిల్లీలోని పాండవ్‌ నగర్‌కు చెందిన అంజన్‌గా గుర్తించారు. 

Published : 28 Nov 2022 14:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక హత్య కేసును ఛేదించేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుకోకుండా మరో హత్యకేసును పరిష్కరించారు. శ్రద్ధావాకర్‌ను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్‌ హత్య చేసి అనంతరం ఆ మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి  దిల్లీలోని పలు ప్రాంతాల్లో పారేశాడు. ఈ విషయం వెలుగులోకి వచ్చాక పోలీసులు శ్రద్ధా శరీర భాగాల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో శద్ధా తల కీలకం కావడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో జూన్‌లో ఎక్కడైనా మానవ అవశేషాలు దొరికాయేమో వాకబ్‌ చేశారు. దిల్లీలోని పాండవ్‌నగర్‌ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని తల, ఇతర మానవ శరీర భాగాలను జూన్‌లో స్వాధీనం చేసుకొన్నట్లు తెలిసింది.

పాండవ్‌నగర్‌ పరిసరాల్లో దొరికిన మానవ అవశేషాలను కూడా పారేసే ముందు ఫ్రిజ్‌లో పెట్టినట్లు తేలడంతో అవి శ్రద్ధావే అని భావించారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్‌గా మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ శరీర భాగాలు దొరికిన చోట్ల ఉన్న సీసీకెమెరాల పుటేజీలను విశ్లేషించారు. అక్కడికి ఓ మహిళ, ఓ యువకుడు వచ్చి పోవడం గుర్తించారు. పాండవ్‌నగర్‌లో దొరికిన శరీర భాగాలు అంజన్‌ దాస్‌ అనే స్థానికుడివని తేలింది. విచారణ చేపట్టి ఈ కేసులో అంజన్‌ భార్య పూనమ్‌, ఆమె కుమారుడు దీపక్‌లను అరెస్టు చేశారు.

నిద్ర మాత్రలు ఇచ్చి.. ముక్కలుగా నరికి..

పూనమ్‌, దీపక్‌లను విచారించగా పోలీసులకు ఒళ్లుగగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు అంజన్‌దాస్‌కు నిద్రమాత్రలు ఇచ్చారు. ఆ తర్వాత అతడిని చంపి శరీరాన్ని ముక్కలుగా నరికారు. ఆ ముక్కలను ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌లో ఉంచారు. తర్వాత ఆ భాగాలను పాండవ్‌నగర్‌.. చుట్టుపక్కల ప్రాంతాల్లో పారేశారు. శరీర భాగాలు పారేస్తున్న సీసీటీవీ పుటేజీలు కూడా పోలీసులకు దొరికాయి. రాత్రివేళ దీపక్‌ ఓ బ్యాగ్‌తో వెళుతుండగా.. అతడి వెనుకే పూనమ్‌ కూడా వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

వావి వరసలు మరిచి..

మృతుడు అంజన్‌కు గతంలోనే బిహార్‌లో పెళ్లై 8మంది పిల్లలు ఉన్నారు. అతడు 2016లో పూనమ్‌ కల్లూను వివాహం చేసుకున్నాడు. అప్పటికే పూనమ్‌ మొదటి భర్త చనిపోయాడు. అంజన్‌ మద్యానికి పూర్తిగా బానిసైపోయాడు. ఈ క్రమంలో అతడు పూనమ్‌ కుమార్తె, కోడలిపై కన్నేసి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో అతడిని అంతం చేయాలని పూనమ్‌, ఆమె కుమారుడు నిర్ణయించుకొన్నారు. అతడికి మద్యంలో నిద్రమాత్రలు కలిపి.. అనంతరం హత్యకు పాల్పడ్డారు. శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టారు. అనంతరం మూడు నాలుగు రోజుల్లో వాటిని పారేశారు. పోలీసులు ఇప్పటి వరకు 6 శరీర భాగాలను స్వాధీనం చేసుకొన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని