
రిజిస్ట్రేషన్‌కు వెళ్తూ అదృశ్యం..ఆచూకీ లభ్యం
పెద్దపల్లి: భూమి రిజిస్ట్రేషన్‌కు వెళ్తూ అదృశ్యమైన ఇద్దరి వ్యక్తుల ఆచూకీ లభ్యమైంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్‌కు చెందిన చిప్ప రాజేశం, లద్నాపూర్ వాసి ఉడుత మల్లయ్యను రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన దుండగులు వారి వద్ద ఉన్న రూ.50 లక్షలు తీసుకొని ఈ ఉదయం రాజాపూర్ శివారులో వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఇద్దరి నుంచి కిడ్నాప్‌కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
రెండు రోజుల కిందట భూమి రిజిస్ట్రేషన్ కోసం రేషన్ డీలర్ చిప్ప రాజేశం, లద్నాపూర్‌కు చెందిన రైతు ఉడుత మల్లయ్య ఇంటి నుంచి బయలుదేరారు. మార్గ మధ్యలో రూ.50 లక్షల నగదు సహా ఇద్దరు అదృశ్యమయ్యారు. పోలీసుల కథనం మేరకు.. రాజేశం, మల్లయ్య భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం సమీపంలో 10 ఎకరాల భూమి కొనుగోలుకు నాలుగేళ్ల కిందట ఒప్పందం చేసుకున్నారు. కొంత మొత్తం బయానా చెల్లించారు. ఆ తర్వాత భూమి అమ్మకం విషయంలో యజమాని, కొనుగోలుదారుల మధ్య వివాదం నెలకొనడంతో కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయింది. ఇటీవల ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలతో వివాదం పరిష్కారమైంది. భూమి రిజిస్ట్రేషన్ చేసిచ్చేందుకు యజమాని అంగీకరించారు.
డబ్బు ఆన్లైన్లో పంపిస్తామని మల్లయ్య, రాజేశంలు చెప్పగా.. యజమాని మాత్రం నగదు రూపంలోనే ఇవ్వాలని అడిగాడు. ఈ నెల 17న స్లాట్ బుక్ చేశారు. మల్లయ్య, రాజేశంలు శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు రూ.50 లక్షల నగదుతో ద్విచక్రవాహనంపై లద్నాపూర్నుంచి కాటారం తహసీల్దారు కార్యాలయానికి బయల్దేరారు. మల్లయ్య కుమారులు సదయ్య, రవిలు మరో ద్విచక్రవాహనంపై వారిని అనుసరించారు. మంథని దాటిన తర్వాత మల్లయ్య, రాజేశంలు కాటారం మార్గంలో వెళ్లగా.. మల్లయ్య కుమారులు తాడిచెర్ల మీదుగా కాటారం తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 దాటినా మల్లయ్య, రాజేశంలు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోలేదు. వారికి ఫోన్‌చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. అనుమానంతో సదయ్య మంథని రహదారి మీదుగా గాలిస్తూ వెనక్కి వచ్చారు. మంథని మండలం బిట్టుపల్లి సమీపంలో రోడ్డుపక్కన మల్లయ్య, రాజేశంలు ప్రయాణించిన ద్విచక్ర వాహనం కనిపించింది. ఆపరిసరాల్లో వెతికినప్పటికీ వారిద్దరి ఆచూకీ లభించలేదు. మల్లయ్య, రాజేశంల అదృశ్యంపై రాజేశం భార్య పుష్పలత ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.