Crime: జాబ్‌ లేదని వీరంగం.. 20 మందికి కత్తిపోట్లు

ఉద్యోగం లేదని కుంగుబాటుకు గురైన ఓ యువకుడు కత్తితో వీరంగం సృష్టించాడు. దొరికినవారిని దొరికినట్లు పొడిచేశాడు. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందగా, 14 మంది గాయపడ్డారు....

Published : 08 Jun 2021 01:26 IST

ఆరుగురి మృతి.. మరొకరి పరిస్థితి విషమం

బీజింగ్‌: ఉద్యోగం లేదని కుంగుబాటుకు గురైన ఓ యువకుడు కత్తితో వీరంగం సృష్టించాడు. దొరికినవారిని దొరికినట్లు పొడిచేశాడు. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందగా, 14 మంది గాయపడ్డారు. తూర్పు చైనాలోని హావ్‌నింగ్‌ ప్రాంతం మెయిన్‌లాండ్‌కు చెందిన వూ (25) ఉద్యోగం లేకపోవడంతో కుంగుబాటుకు లోనయ్యాడు. దీనికి తోడు కుటుంబంతో గొడవలు తలెత్తడంతో కోపోద్రిక్తుడై ఈ దారుణానికి పాడినట్లు పోలీసులు తెలిపారు. పదునైన కత్తితో వీధుల్లోకి వచ్చి కనిపించిన వారిపై దాడికి తెగబడ్డాడని, ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందినట్లు పేర్కొన్నారు. మరో 14 మంది గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు.

బాధితులు గాయాలతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. రోడ్డు పొడవునా రక్తపు మరకలు అందులో కనిపిస్తున్నాయి. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. మే 22న ఓ వ్యక్తి పాదచారులే లక్ష్యంగా కారుతో విధ్వంసం సృష్టంచాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సదరు నిందితుడిని ప్రశ్నించగా.. సమాజం మీద పగ తీర్చుకునేందుకే తాను ఈ దాడికి పాల్పడినట్లు వెల్లడించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని