Drugs case: లక్ష్మీపతి టార్గెట్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే.. డ్రగ్స్‌ కేసులో కొత్త కోణం

నగరంలో డ్రగ్స్‌ మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది. మత్తు పదార్థాలకు బానిసై ఇటీవల బీటెక్‌ విద్యార్థి మృతి చెందడంతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసులు..

Published : 02 Apr 2022 01:53 IST

హైదరాబాద్‌: నగరంలో డ్రగ్స్‌ మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది. మత్తు పదార్థాలకు బానిసై ఇటీవల బీటెక్‌ విద్యార్థి మృతి చెందడంతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసులు.. తవ్వేకొద్దీ బయటికొస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌ నార్కోటిక్‌ నియంత్రణ విభాగం పోలీసులు మాదక ద్రవ్యాల కేసుల దర్యాప్తును వేగవంతం చేశారు. నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శివమ్‌రోడ్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ప్రేమ్‌ ఉపాధ్యాయ్‌ అనే వ్యక్తిని నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ బృందం నల్లకుంట పోలీసుల సాయంతో అరెస్టు చేసింది. అతనితో పాటు డ్రగ్స్‌ వినియోగిస్తున్న ముగ్గురుని కూడా అరెస్టు చేశారు. ప్రేమ్‌ ఉపాధ్యాయ్‌ను అరెస్టు చేయడంతో అతనికి హాష్‌ అయిల్‌ సరఫరా చేస్తున్న లక్ష్మీపతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లక్ష్మీపతి గురించి ఆరాతీసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్ష్మీపతి హైదరాబాద్‌లో భారీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకే అతను హాష్‌ అయిల్‌ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఐసో ప్రొఫైల్‌ ఆల్కహాల్‌లో గంజాయి పూతను మరిగించి హాష్ అయిల్‌ను సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. నాణ్యమైన హాష్‌ అయిల్‌ ఇస్తుండటంతో వినియోగదారులు లక్ష్మీపతి ఖాతాలో చేరిపోయారు. స్నాప్‌ చాట్‌, టెలిగ్రామ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, బీటెక్‌ విద్యార్థులకు లక్ష్మీపతి సమాచారం ఇస్తున్నాడు. ఒక్కో లీటర్‌ హాష్ అయిల్‌ను రూ.6లక్షలకు విక్రయిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. లక్ష్మీపతి కాంటాక్ట్‌ లిస్టులో దాదాపు 100 మందికి పైగా వినియోగదారులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇతనిపై అప్జల్‌గంజ్‌, నల్లకుంట, గోల్కొండ, జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గతంలో కేసులున్నాయి. బీటెక్‌ మధ్యలోనే ఆపేసిన లక్ష్మీపతి హాష్ ఆయిల్‌ను విక్రయించడమే జీవనోపాధిగా ఎంచుకున్నాడు. పరారీలో ఉన్న నిందితుడు గోవా లేదా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఉండొచ్చని అనుమానిస్తున్నారు. లక్ష్మీపతిని అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని