Crime news: ₹500 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం

భారత్‌ - మయన్మార్‌ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ఓ పట్టణంలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. అస్సాం రైఫిల్స్‌, మణిపూర్‌ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో దాదాపు ₹500 కోట్ల విలువ .....

Published : 07 Dec 2021 20:13 IST

మోరే: భారత్‌ - మయన్మార్‌ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ఓ పట్టణంలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. అస్సాం రైఫిల్స్‌, మణిపూర్‌ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో దాదాపు ₹500 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. తమకు వచ్చిన ముందస్తు సమాచారం ఆధారంగా మణిపూర్‌లోని మోరే పట్టణంలో 43 అస్సాం రైఫిల్స్‌, మణిపూర్‌ పోలీసులు సంయుక్తంగా నిన్న ఆపరేషన్‌ నిర్వహించినట్టు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా సన్‌రైజ్‌ గ్రౌండ్‌లోని ఓ ఇంటి నుంచి నిషిద్ధ మాదకద్రవ్యాలను సీజ్‌ చేసి మయన్మార్‌కి చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 3716 సోప్‌ కేస్‌లలో 54 కిలోల బ్రౌన్‌ షుగర్‌, 152 ప్యాకెట్లలో క్రిస్టల్‌ మెథాంఫెటామిన్‌ (154 కిలోలు) ఉన్నట్టు గుర్తించారు.

ఈ ఘటనపై తెంగ్‌నౌపాల్‌ జిల్లా ఎస్పీ విక్రమ్‌ జిత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా అంతర్జాతీయ సరిహద్దులో ఈ ఆపరేషన్‌ చేపట్టినట్టు వెల్లడించారు. ఈ డ్రగ్స్‌ నిల్వచేసిన ఇంటిని కొంత కాలంపాటు నిఘాలో ఉంచనున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి తుదపరి దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. మాదకద్రవ్యాలను మోరే పోలీస్‌ స్టేషన్లోనే అప్పగించినట్టు వివరించారు. ఇలా సంయుక్త ఆపరేషన్‌లో డ్రగ్స్‌ రాకెట్‌ని ఛేదించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా 43 అస్సాం రైఫిల్స్‌, మణిపూర్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి ₹165కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.

బలగాలకు సీఎం అభినందన

సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి డ్రగ్స్‌ని సీజ్‌ చేసిన బలగాలను మణిపూర్‌ సీఎం ఎన్‌ బీరెన్‌ సింగ్‌ ప్రశంసించారు. తెంగ్‌నౌపాల్‌ పోలీసులు, 43వ అస్సాం రైఫిల్స్‌ దళం సంయుక్తంగా డ్రగ్స్‌ని పట్టుకోవడంపై హర్షం ప్రకటించారు. డ్రగ్స్‌పై తమ ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో భాగంగా సీజ్‌ చేసిన డ్రగ్స్‌లో ఇది అతిపెద్ద ముందడుగు అని చెప్పారు. 

Read latest Crime News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని