Duranto Express: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్‌..

ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. రైలు హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 30 Mar 2023 12:47 IST

భీమడోలు: ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. రైలు సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం వేకువజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో 6 గంటలకు పైగా రైలు నిలిచిపోయింది. ఆ తర్వాత విశాఖకు బయల్దేరి వెళ్లింది.

దురంతో ఎక్స్‌ప్రెస్‌ వస్తుండటంతో భీమడోలు జంక్షన్‌ వద్ద రైల్వే గేటును సిబ్బంది వేశారు. అదే సమయంలో బొలెరోలో వచ్చిన కొంతమంది వ్యక్తులు వాహనంతో రైల్వే గేటును ఢీకొట్టి వెళ్లే ప్రయత్నం చేశారు.  ఈ క్రమంలో ఆ వాహనం రైల్వే ట్రాక్‌పైకి వచ్చింది. అదే సమయంలో దురంతో ఎక్స్‌ప్రెస్‌ సమీపించడంతో సదరు వ్యక్తులు బొలెరో వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. రైలు ఢీకొనడంతో ఆ వాహనం ధ్వంసమైంది.

రైలు ఇంజిన్‌ ముందు భాగం దెబ్బతినడంతో సిబ్బంది మరో ఇంజిన్‌ను అమర్చారు. దురంతో ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు కొందరు ప్రత్యామ్నాయ మార్గాల్లో బయల్దేరి వెళ్లారు. ఈ ఘటనపై రైల్వేపోలీసులు విచారణ చేపట్టారు. బొలెరో వాహనంలో వచ్చినవాళ్లు దొంగలా? పారిపోయే క్రమంలో గేటును ఢీకొట్టారా? లేదా మరేదైనా కారణమా? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని