Telangana News: ప్రియుడితో కలిసి తండ్రిని కడతేర్చిన కుమార్తె

ఓవైపు తన ప్రేమ వ్యవహారానికి అడ్డుపడుతూ మరోవైపు భూమి పత్రాలు ఇవ్వడం లేదనే కక్షతో కన్న తండ్రిని ఓ కూతురు (17).. ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన మహబూబాబాద్‌ మండలంలోని ఓ

Updated : 30 Apr 2022 08:36 IST

మహబూబాబాద్‌ రూరల్‌, న్యూస్‌టుడే: ఓవైపు తన ప్రేమ వ్యవహారానికి అడ్డుపడుతూ మరోవైపు భూమి పత్రాలు ఇవ్వడం లేదనే కక్షతో కన్న తండ్రిని ఓ కూతురు (17).. ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన మహబూబాబాద్‌ మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..ఉన్నంతలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న కన్నతండ్రి (45)ని నిర్దాక్షిణ్యంగా హతమార్చింది ఓ కుమార్తె. ఆ రైతు భార్య ఏడాది కిందట కరోనాతో మృతి చెందింది. దీంతో ఆ కుమార్తె  ఏడో తరగతి మధ్యలోనే చదువు మానివేసి ఇంట్లోనే ఉంటోంది.  తండ్రికి అర ఎకరం వ్యవసాయ భూమి ఉంది. ఆయనకు మద్యం తాగే అలవాటు ఉండడంతో వారి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండేవి. ఉన్న కాస్త వ్యవసాయ భూమి విక్రయిస్తాడనే భయంతో గ్రామంలో పెద్దమనుషులను ఆయన కుమార్తె ఆశ్రయించింది. వారి సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఆ పత్రాలను వారి వద్దే భద్రపరిచారు. ఈ విషయంలో తండ్రి, కూతురు మధ్య గొడవలు మరింత పెరిగాయి. గురువారం ఉదయం  మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో ప్రియుడు వెంకటేశ్‌తో కలిసి తండ్రిని కర్రలతో విపరీతంగా కొట్టింది. శరీరంలో పలు చోట్ల బలమైన గాయాలు తగిలి ఆయన మరణించారు. తండ్రిని కొట్టిన తర్వాత ఇంటికి తాళం వేసి గ్రామంలోని కొంతమందికి తన తండ్రితో జరిగిన ఘర్షణ గురించి తెలియజేసింది. గ్రామస్థులకు అనుమానం కలిగి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆయన విగతజీవిగా కనిపించారు. దీంతో వారు మహబూబాబాద్‌ రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఉదయం రూరల్‌ సీఐ రవికుమార్‌, ఎస్సై అరుణ్‌కుమార్‌ ఘటనాస్థలిని పరిశీలించారు. వారి విచారణలో ఆమెకు గ్రామంలోని వెంకటేశ్‌తో ప్రేమ వ్యవహారం ఉందని తెలిసింది. పెళ్లికి కొద్దికాలం ఆగాలని తండ్రి మందలించడంతో ఆమె కక్ష పెంచుకుందని తెలిసింది. మృతుడి సోదరుడు  ఫిర్యాదు మేరకు  ఆ కూతురుపై, వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని