Accident: అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 18 మంది మృతి

పుట్టెడు దుఃఖంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు బయల్దేరిన బంధువులకు.. అదే చివరి ప్రయాణమైంది! పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దాదాపు 18 మంది మృతి చెందారు....

Published : 29 Nov 2021 01:04 IST

కోల్‌కతా: పుట్టెడు దుఃఖంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు బయల్దేరిన బంధువులకు.. అదే చివరి ప్రయాణమైంది! పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దాదాపు 18 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దాదాపు 35 మందికిపైగా బంధువులు ఓ మినీ ట్రక్కులో చక్దా నుంచి నబద్వీప్‌లోని శ్మశానానికి వెళ్తుండగా.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వారు ప్రయాణిస్తున్న వాహనం హన్స్‌ఖాలీలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో, చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పొగమంచు కారణంగా దారి కనిపించక ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి..

ఈ ఘటనపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘నాడియా రోడ్డు ప్రమాదం గురించి విని నా గుండె పగిలింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని మమతా ట్వీట్‌ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. షా సైతం.. తీవ్ర సంతాపం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని