Encounter: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌.. కీలక నేత హిడ్మా హతం?

బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌  జరిగింది. కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం.

Updated : 11 Jan 2023 19:09 IST

బీజాపూర్‌: మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అడవుల్లో బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కీలక నేతను కోల్పోయినట్టు తెలుస్తోంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)కి కమాండర్‌గా ఉన్న హిడ్మా ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్టు సమాచారం. అయితే, దీనిపై ఇంకా పోలీసులు కానీ, మావోయిస్టు పార్టీ కానీ అధికారికంగా ప్రకటించలేదు. బుధవారం ఉదయం బీజాపూర్‌ అడవుల్లో సీఆర్‌పీఎఫ్‌ దళాలు కూబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురు పడటంతో ఎన్‌కౌంటర్‌ జరిగింది. కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. మృతిచెందిన మావోయిస్టులను నిర్ధరించే పనిలో పోలీసులు ఉన్నారు. కూంబింగ్‌ కోసం పోలీసులు హెలికాప్టర్‌ను కూడా వినియోగించినట్టు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌ వార్తలపై బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ స్పందించారు. భద్రతాదళాల సభ్యులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. సవివరమైన సమాచారం త్వరలో తెలియజేస్తామని ప్రకటించారు.

ఎవరీ హిడ్మా?

పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)కి హిడ్మా కమాండర్‌గా ఉన్నారు. ఈ దళంలోని సభ్యులు అత్యాధునిక ఆటోమేటిక్‌ ఆయుధాలను వినియోగిస్తారు. దళాలపై దాడులు చేశాక.. అపహరించిన అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లను ఈ బెటాలియన్‌ ఎక్కువగా వాడుతుంటుంది. వీరు పూర్తిగా యూనిఫామ్‌లో ఉంటారని పేరు. హిడ్మా నేతృత్వంలో జరిగే దాడుల్లో భద్రతా దళాలకు జరిగే నష్టంతో పోలిస్తే మావోల వైపు 10శాతం కంటే తక్కువ ప్రాణ నష్టం ఉంటుందనే పేరుంది. అందుకే గతంలో సుక్మా సమీపంలో జరిగిన దాడుల్లో భద్రతా దళాలు భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూశాయి. అందుకే అతడు అత్యంత వేగంగా మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా స్థానం దక్కించుకొన్నాడు. సాధారణంగా ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల వారు అత్యధికంగా ఉంటారు. కానీ, సుక్మా నుంచి ఈ స్థానంలోకి వెళ్లిన తొలి వ్యక్తి హిడ్మా.  

వీరప్పన్‌ స్టైల్‌లో..

వీరప్పన్‌ కర్ణాటక-తమిళనాడు అడవుల్లో పాతుకుపోవడానికి కలిసొచ్చిన పరిస్థితులే ఇప్పుడు మావో నేత హిడ్మాకు కలిసొస్తున్నట్లు భద్రతా రంగ నిపుణులు చెబుతున్నారు. హిడ్మా స్థానిక ఆదివాసి తెగకు చెందిన వ్యక్తి కావడంతో అతడికి గ్రామస్థుల మద్దతు లభిస్తోంది. దీంతో బలమైన ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొన్నాడు. అతను ఉన్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల అవతల భద్రతా దళాల కదలికలు కూడా అతనికి తెలిసిపోతాయి. ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాకు తేలిగ్గా వెళ్లే జంక్షన్‌లో ఉండటం కూడా అతనికి కలిసి వస్తోందని సీనియర్‌ పోలీసు అధికారులు చెబుతున్నారు. సుక్మా చుట్టుపక్కల అడవుల్లోని మార్గాలపై హిడ్మాకు బలమైన పట్టుంది. అడవుల్లో జరిగే పోరు ఎప్పుడూ స్థానికులకే అనుకూలంగా ఉంటుంది. ఇదే విషయం గతంలో వీరప్పన్‌కు, ఇప్పుడు హిడ్మాకు అనుకూలంగా మారింది. పాఠశాలలో కేవలం 10వ తరగతి వరకే చదివిన హిడ్మా ఇంగ్లిష్‌ మాత్రం చక్కగా మాట్లాడగలడని 2015లో ఫిబ్రవరిలో అతన్ని ఇంటర్వ్యూ చేసిన ఓ విలేకరి పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని