Uttar Pradesh: యూపీలో ‘దిల్లీ’ తరహా హత్య.. మరో పెళ్లి చేసుకుందని ముక్కలుగా నరికిన మాజీ ప్రియుడు

తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. ఓ యువతిని అతిదారుణంగా చంపేశాడో వ్యక్తి. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి బావిలో పడేశాడు.

Updated : 21 Nov 2022 10:19 IST

ఆజంగఢ్‌: దేశ రాజధాని దిల్లీలో ప్రియుడి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్‌ ఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్‌లో అలాంటి ఘోరమే చోటుచేసుకుంది. తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. ఓ యువతిని అతిదారుణంగా చంపేశాడో వ్యక్తి. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి బావిలో పడేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆజంగఢ్‌ జిల్లాలోని ఇషాఖ్‌పుర్‌ గ్రామానికి చెందిన ఆరాధన.. అదే ప్రాంతానికి చెందిన ప్రిన్స్‌ యాదవ్‌ గతంలో ప్రేమించుకున్నారు. అయితే, కొన్ని కారణాలతో వీరిద్దరూ విడిపోయారు. ఈ ఏడాది ఆరంభంలో ఆరాధన మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న ప్రిన్స్‌ ఎలాగైనా ఆమెను చంపేందుకు కుట్ర పన్నాడు. ఈ నెల 9వ తేదిన గుడికి వెళ్దామంటూ ఆమెను బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తన స్నేహితుల సాయంతో ఆమెను గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఓ పాలిథీన్‌ బ్యాగ్‌లో కుక్కి, బావిలో పడేశాడు.

ఆరాధన కన్పించకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 15వ తేదీన గ్రామ శివారులోని ఓ బావిలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గత శనివారం ప్రిన్స్‌ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునేందుకు నిందితుడు వారిపై దేశీయ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఎదురుకాల్పులు జరిపి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ప్రిన్స్‌తో పాటు అతడికి సహకరించిన కుటుంసభ్యులు, స్నేహితులను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని