Murder: స్థల వివాదం... తీసింది నిండు ప్రాణం

ఇంటి స్థలం విషయంలో తలెత్తిన గొడవ ఎంపీటీసీ మాజీ సభ్యుడి దారుణ హత్యకు దారితీసింది. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఘట్‌కేసర్‌ సీఐ ఎస్‌.సైదులు తెలిపిన ప్రకారం...

Updated : 25 Jun 2024 07:23 IST

ఎంపీటీసీ మాజీ సభ్యుడిని హత్య చేసి, పూడ్చేసిన నిందితులు 

ఘట్‌కేసర్, న్యూస్‌టుడే: ఇంటి స్థలం విషయంలో తలెత్తిన గొడవ ఎంపీటీసీ మాజీ సభ్యుడి దారుణ హత్యకు దారితీసింది. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఘట్‌కేసర్‌ సీఐ ఎస్‌.సైదులు తెలిపిన ప్రకారం... ఘట్‌కేసర్‌ మాజీ ఎంపీటీసీ సభ్యుడు, స్థిరాస్తి వ్యాపారి గడ్డం మహేశ్‌(50) భార్యతో విభేదాల కారణంగా తల్లితో కలిసి స్థానిక అంబేడ్కర్‌నగర్‌లో నివాసముంటున్నారు. అదేప్రాంతంలో ఉన్న 300 గజాల స్థలంపై ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ ఉద్యోగి అనిగాళ్ల శ్రీనివాస్‌ అలియాస్‌ చిన్న(35)తో కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఇద్దరూ జిల్లా కోర్టుకు వెళ్లగా ఇటీవల మహేశ్‌కు అనుకూలంగా తీర్పువచ్చింది. శ్రీనివాస్‌ కబ్జా నుంచి తప్పుకోకపోవడంతో గ్రామస్థులతో పంచాయితీ పెట్టారు. తనకు రూ.5 లక్షలిస్తే స్థలాన్ని వదిలేస్తానని మహేశ్‌ చెప్పగా శ్రీనివాస్‌ అంగీకరించలేదు. మరోవైపు మహేశ్‌కు స్థానికుడైన కారు డ్రైవర్‌ కడపోల్ల ప్రవీణ్‌(27)తోనూ మరో స్థలంపై వివాదం కొనసాగుతోంది. దాంతో శ్రీనివాస్, ప్రవీణ్‌ కలిసి మహేశ్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. స్థిరాస్తి వ్యాపారులైన పోకల రాజు(23), కడపోల్ల శ్రీరాములు(37)ల సహాయం తీసుకున్నారు. స్థలం విషయమై మాట్లాడుదామంటూ ఈనెల 15న ఉదయం మహేశ్‌కు ఫోన్‌ చేసి పిలిపించారు. అతను కారులో ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ మాటామాటా పెరిగి శ్రీనివాస్, మహేశ్‌ల మధ్య ఘర్షణ జరగ్గా శ్రీనివాస్‌ చేతికి గాయమైంది. దాంతో మహేశ్‌ కంట్లో ప్రవీణ్‌ కారంపొడి చల్లగా శ్రీనివాస్‌ కర్రతో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే చనిపోయారు. 

మృతదేహాన్ని అక్కడే వదిలేసిన శ్రీనివాస్‌... మహేశ్‌ కారులోనే కేఫాల్‌ వెళ్లి చేతికి కట్టు కట్టించుకున్నాడు. అదేరోజు రాత్రి 11 గంటలకు ప్రవీణ్‌ బంధువు కడపోల్ల నరేష్‌తో జరిగిన విషయం చెప్పారు. అతని జేసీబీని బిహార్‌కు చెందిన డ్రైవర్‌తో కొండాపూర్‌ మార్గంలోని డంపింగ్‌ యార్డు వద్దకు తీసుకెళ్లారు. ఆరడుగుల గుంత తీయించి, డ్రైవర్‌ను పంపించేశారు. తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి గుంతలో వేసి పూడ్చేశారు. 


వెలుగులోకి వచ్చిందిలా... 

హేశ్‌కు బంధువులు ఫోన్‌చేస్తే.. శ్రీనివాస్‌ మాట్లాడి ‘‘అతను పనిలో ఉన్నాడు. తర్వాత ఫోన్‌ చేయిస్తా’’ అని చెబుతూ వచ్చాడు. ఈ నెల 17న ఫోన్‌ పని చేయకపోవడంతో ఈ నెల 20న మహేశ్‌ సోదరుడు విఠల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తుతో భయపడిన శ్రీనివాస్, ప్రవీణ్‌లు.. ఆదివారం రాత్రి ఠాణాలో లొంగిపోయారు. సోమవారం ఉదయం పోలీసులు ఘట్‌కేసర్‌ డిప్యూటీ తహసీల్దార్‌ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీయించి, గాంధీ ఆసుపత్రి వైద్య బృందంతో అక్కడే పోస్ట్‌మార్టం చేయించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. నిందితుల ఇళ్లపై కొందరు రాళ్లు వేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నలుగురు నిందితులు అదుపులో ఉన్నారని, ఇద్దరు పరారీలో ఉన్నారని ఏసీపీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని