13వేల జాబ్స్‌, 27వేల బాధితులు.. గుట్టురట్టు!

దిల్లీకి చెందిన సైబర్‌ క్రైం పోలీసులు భారీ నకిలీ జాబ్‌ రాకెట్‌ ముఠా గుట్టు రట్టు చేశారు. ఫేక్‌ ప్రభుత్వ సైట్‌ ద్వారా 13వేల ఉద్యోగాల ప్రకటనతో.. దాదాపు 27వేల మందికి నిరుద్యోగులను మోసం చేసిన ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు.

Published : 06 Nov 2020 01:08 IST

దిల్లీ: దిల్లీకి చెందిన సైబర్‌ క్రైం పోలీసులు భారీ నకిలీ జాబ్‌ రాకెట్‌ ముఠా గుట్టు రట్టు చేశారు. ఫేక్‌ ప్రభుత్వ సైట్‌ ద్వారా 13వేల ఉద్యోగాల ప్రకటనతో.. దాదాపు 27వేల మందికి నిరుద్యోగులను మోసం చేసిన ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. దిల్లీ సైబర్‌ క్రైం డీసీపీ అన్వేష్‌ రాయ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పేరుతో నకిలీ సైట్‌ ద్వారా మోసపోయానంటూ ఇటీవల ఓ బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. దీంతో చీటింగ్‌, ఫోర్జరీ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా.. కొందరు వ్యక్తుల ముఠా ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేరుతో నకిలీ సైట్‌ ప్రారంభించినట్లు గుర్తించాం. ఆ నకిలీ వెబ్‌సైట్‌ హరియాణాలోని హిసార్‌ ప్రాంతం నుంచి నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వేగంగా దర్యాప్తు చేపట్టి హరియాణాలోని వివిధ ప్రాంతాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నాం. నిందితులు ఓ ప్రభుత్వ శాఖలో అకౌంటెంట్‌, యూడీసీ, ఎల్‌డీసీ, ఏఎన్‌ఎం, ల్యాబ్‌ అటెండెంట్‌, అంబులెన్స్‌ డ్రైవర్‌ సహా తదితరాలైన 13వేల పోస్టులను ఫేక్‌ సైట్‌ ద్వారా ప్రకటన ఇచ్చారు. నిరుద్యోగులకు ఆశచూపి వారి నుంచి దరఖాస్తు రుసుం కింద రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేశారు. అలా మొత్తం ఇప్పటివరకు 27వేల మందిని ఇందులో బాధితులుగా ఉన్నట్లు గుర్తించాం’ అని తెలిపారు. నిందితుల సంబంధించి రూ.49లక్షల ఉన్న వారి బ్యాంకు ఖాతాను నిలిపివేసినట్లు డీసీపీ తెలిపారు. నిందితుల్ని హరియాణాకు చెందిన రాంధారి, అమనదీప్‌, సురేంద్ర సింగ్‌, సందీప్‌, జోగిందర్‌ సింగ్‌లుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కుట్రలో 50 ఏళ్ల వయసున్న రాంధారి అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా గుర్తించినట్లు డీసీపీ వెల్లడించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని