crime news: కన్నవాళ్లే కడతేర్చారు..!

ఓ యువకుడితో పారిపోయి తిరిగి వచ్చిన యువతిని కుటుంబ సభ్యులే హతమార్చారు. పైగా దాన్ని ఆత్మహత్యగా మార్చాలని ప్రయత్నించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గురువారం చోటు చేసుకుంది.

Published : 13 Aug 2021 01:37 IST

గ్వాలియర్‌: ఓ యువకుడితో పారిపోయి తిరిగి వచ్చిన ఇరవై ఏళ్ల యువతిని కుటుంబ సభ్యులే హతమార్చారు. పైగా దాన్ని ఆత్మహత్యగా మార్చాలని ప్రయత్నించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జానక్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన ఓ యువతి మరో వర్గానికి చెందిన యువకుడితో జూన్‌ 5న ఇంట్లో నుంచి పారిపోయింది. తను కనిపించకపోయే సరికి కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు జులై 7న తిరిగి రావడంతో పోలీసులు పర్యవేక్షణ నిమిత్తం ఉమెన్స్‌ షెల్టర్‌ హోమ్‌కు తరలించారు. అయితే, జులై 31న తన తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి అమ్మాయి సమ్మతించగా..పోలీసులు ఇంటికి పంపించారు.

ఇంటికి వెళ్లిన రెండ్రోజుల తర్వాత యువతి తండ్రి పోలీసు స్టేషన్‌కు వచ్చి తన కూతురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వాపోయాడు. తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలంలో యువతి మృతదేహం చూసి అనుమానాస్పద మృతిగా ఉందని భావించారు. అనుకున్నట్టుగానే ఫోరెన్సిక్ నిపుణులు అందించిన నివేదికలో మహిళ ఆత్మహత్య చేసుకోలేదని.. వేరే వాళ్లు ఉరి వేసి చంపినట్లుగా ఉందని తెలిసింది. అనంతరం ఆ యువతి తండ్రిని, కుటుంబసభ్యులను పోలీసులు విచారించారు. అందులో భాగంగా ఆమెను చంపి దాన్ని ఆత్మహత్యగా చిత్రించాలని ప్రయత్నించారని తేలింది. ఆమె తండ్రి, సోదరుడిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని