Crime News: అధిక వడ్డీల కోసం వాళ్లిద్దరూ ఒత్తిడి తెచ్చారు..సురేశ్‌ సెల్ఫీ వీడియో

రెండు రోజుల కిందట విజయవాడలో కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసుకున్న పప్పుల సురేశ్‌ ఆత్మహత్యకు ముందు

Updated : 10 Jan 2022 13:12 IST

విజయవాడ: రెండు రోజుల కిందట విజయవాడలో కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసుకున్న పప్పుల సురేశ్‌ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బహిర్గతమైంది. ఆత్మహత్యకు వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణమని అతను అందులో తెలిపారు. వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సురేశ్‌ కోరారు. అధిక వడ్డీల కోసం జ్ఞానేశ్వర్‌ అనే వ్యక్తి ఒత్తిడి తెచ్చాడని వివరించారు. అతనికి రూ.40లక్షలకు పైగా వడ్డీలు చెల్లించాలని చెప్పారు. వడ్డీలు చెల్లించకపోతే ఇల్లు జప్తు చేస్తామని బెదిరించినట్లు సురేశ్‌ వీడియోలో వెల్లడించారు. ప్రామిసరీ నోట్లపై భార్య, పిల్లల సంతకం చేయించుకున్నట్లు తెలిపారు.

అధిక వడ్డీల కోసం గణేశ్‌ అనే వ్యక్తి కూడా తమపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని చెప్పారు. గణేశ్‌కు రూ.82లక్షల వరకు చెల్లించినట్లు వాపోయారు. కొవిడ్‌ పరిస్థితుల్లో వ్యాపారం కోసం డబ్బు అప్పు తీసుకున్నామన్నారు. వడ్డీల మీద వడ్డీలు కట్టామని సురేశ్‌ వీడియోలో చెప్పారు. అయినా ఇంకా డబ్బులు కట్టాలని బెదిరించారని.. గూండాలతో తమపై దాడి చేయిస్తామన్నారని తెలిపారు. దీంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. తన లాంటి బాధితులు చాలా మంది ఉన్నారని వీడియోలో వివరించారు.

విజయవాడలోని దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేష్‌, ఆయన భార్య శ్రీలత, కుమారులు అఖిల్‌, ఆశీష్‌లు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సురేశ్‌ కుమారుడు బలవన్మణానికి సంబంధించి ఆడియో మెసేజ్‌ బంధువులకు పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ నలుగురి అంత్యక్రియలు ముగిశాయి. నిజామాబాద్‌ ఆర్యవైశ్య శ్మశానవాటికలో అంత్యక్రియలను బంధువులు పూర్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని