Palnadu: పంట వ్యర్థాలను తగులబెడుతూ రైతు సజీవ దహనం

పంటపొలంలోని వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో ఓ రైతు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో చోటుచేసుకుంది.

Updated : 18 May 2023 11:06 IST

నాదెండ్ల: పంటపొలంలోని వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో ఓ రైతు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రైతు బండారుపల్లి వెంకటేశ్వర్లు(70) తన పొలంలో మొక్కజొన్న పంట సాగుచేశారు. మొక్కజొన్నలు కోసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను బుధవారం తగలబెట్టారు. అయితే ఆ మంటలు పక్కనే ఉన్న తన  సోదరుడి పొలంలోకి వ్యాపిస్తున్నాయని.. వాటిని నిలువరించేందుకు పరుగెడుతుండగా దురదృష్టవశాత్తు ఆయన కిందపడ్డారు. 

రైతు కిందపడిపోయిన సమయంలో సమీపంలో ఉన్న కొంతమంది గొర్రెల కాపరులు ఆయన్ను చూసి రక్షించేందుకు యత్నించినా మంటలు ఎక్కువగా ఉండటంతో సాధ్యపడలేదు. దీంతో మంటలు చుట్టుముట్టడంతో రైతు సజీవ దహనమయ్యారు. సాయంత్రం గడిచినా రైతు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆయన ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలో పొలంలో రైతు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. రైతు మృతదేహానికి గురువారం నరసరావుపేట తెదేపా ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, తెదేపా మండల శాఖ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ తదితరులు నివాళులర్పించారు. ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని నాదెండ్ల పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని