Crime News: మియాపూర్‌లో దారుణం.. అశ్లీల వీడియోలకు బానిసగా మారి కన్న కూతురి హత్య

అశ్లీల వీడియోలు చూడడం అలవాటు చేసుకున్న ఓ తండ్రి కన్న బిడ్డపైనే కన్నేశాడు. అతడి దుర్మార్గపు చేష్టల్ని చిన్నారి తిరస్కరించడంతో బండరాయితో కొట్టి దారుణంగా చంపేశాడు.

Updated : 20 Jun 2024 08:54 IST

బండరాయితో కొట్టి చంపి.. అదృశ్యమైందని ఫిర్యాదు
పోలీసులు పట్టించుకోవడం లేదని ఠాణాకెళ్లి హంగామా
చివరికి కటకటాలపాలు

ఈనాడు, హైదరాబాద్‌; మియాపూర్, న్యూస్‌టుడే: అశ్లీల వీడియోలు చూడడం అలవాటు చేసుకున్న ఓ తండ్రి కన్న బిడ్డపైనే కన్నేశాడు. అతడి దుర్మార్గపు చేష్టల్ని చిన్నారి తిరస్కరించడంతో బండరాయితో కొట్టి దారుణంగా చంపేశాడు. మియాపూర్‌ ఎస్సై రాజు, ఇన్‌స్పెక్టర్‌ వి.దుర్గా రామలింగప్రసాద్‌తో కలిపి ఏసీపీ నర్సింహ్మరావు బుధవారం ఇక్కడ ఈ కేసు వివరాలు వెల్లడించారు.

పారిపోతున్నా వెంటాడి.. 

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలానికి చెందిన బానోతు నరేశ్‌(35) తన భార్య, కుమార్తె(13)తో కలిసి నెల రోజుల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌ నగరానికి వచ్చాడు. ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి నడిగడ్డ తండాలో కుటుంబంతో ఉంటున్నాడు. నరేశ్‌కు ఫోన్లో అశ్లీల వీడియోలు చూడడం అలవాటు. లైంగిక వాంఛ తీర్చుకోవడానికి కుమార్తెపై కన్నేశాడు. ఈనెల 7న ఉదయం 9.45 గంటల సమయంలో వంట చెరకు కోసం వెళ్దామని ఆమెను సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వాంఛ తీర్చాలని వేధించాడు. భయపడ్డ చిన్నారి గట్టిగా కేకలు పెడుతూ బయటపడేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని భార్యకు, ఇతరులకు చెబుతుందని భావించిన నరేశ్‌ ఆమెను చంపాలనుకున్నాడు. పారిపోతున్న ఆమెను పట్టుకుని ముఖంపై గట్టిగా కొట్టాడు. స్పృహ తప్పి పడిపోయాక తలను నేలకు గట్టిగా కొట్టాడు. ఊపిరాడకుండా చేసి.. బండరాయితో తల వెనుకభాగంలో కొట్టి కిరాతకంగా హతమార్చాడు.

రోజూ వెళ్లి శవాన్ని చూసొచ్చేవాడు..

చదువుకోవాలని మందలించినందుకు తన కుమార్తె ఇంటినుంచి వెళ్లిపోయిందని నరేశ్‌ 7వ తేదీనే మియాపూర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. రోజూ కుమార్తె మృతదేహాన్ని చూసొచ్చేవాడు. పోలీసుల గాలింపు కొనసాగుతుండగానే ఈ నెల 13న నడిగడ్డ తండాకు సమీపంలోని నిర్జన ప్రాంతంలో బాలిక మృతదేహం లభించింది. మృతదేహం దొరికిన ప్రాంతంలో పరిస్థితుల్ని బట్టి పోలీసులు హత్య అని భావించారు. 

పట్టించిన సీసీటీవీ ఫుటేజీ..

దర్యాప్తు జరుగుతున్న క్రమంలో నరేశ్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన కుమార్తె అదృశ్యంపై పట్టించుకోవడం లేదని హంగామా చేశాడు. దర్యాప్తు క్రమంలో 18న పోలీసులకు ఒక సీసీటీవీ ఫుటేజీ లభించింది. 7న నరేశ్‌ తన కుమార్తెను ఇంటి నుంచి అటవీ ప్రాంతంవైపు తీసుకెళ్తున్నట్లు రికార్డయింది. వెళ్లేటప్పుడు బైకుపై కుమార్తె ఉన్నా.. తిరిగొచ్చేటప్పుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. పోలీసులు నరేశ్‌ను ఠాణాకు పిలిపించి ప్రశ్నించగా నిజం అంగీకరించాడు. అతడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని