Visakhapatnam: కుమార్తె ప్రవర్తన నచ్చలేదని ప్రాణాలు తీసిన తండ్రి

తనకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతో కన్న కుమార్తెను తండ్రి హతమార్చిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది.

Updated : 05 Nov 2022 14:44 IST

సెల్ఫీ వీడియోలో తానే చంపినట్లు వెల్లడి

ఈనాడు, విశాఖపట్నం - న్యూస్‌టుడే, జగదాంబకూడలి: తనకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతో కన్న కుమార్తెను తండ్రి హతమార్చిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను ఎందుకు చంపానన్న విషయాన్ని సెల్ఫీ వీడియోలో వివరించి, ఆపై పోలీసులకు లొంగిపోయాడు. ఎ.వి.ఎన్‌.కళాశాల సమీపంలోని ఓ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న బాలిక లిఖితకు అరవింద్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె తండ్రి వరప్రసాద్‌ తీవ్ర ఆవేదన చెందాడు. అరవింద్‌తో కలిసి ఇటీవల కుమార్తె బయటకు వెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వాళ్లిద్దరినీ తీసుకొచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ యువకుడితో తిరగొద్దని ప్రసాద్‌ చెప్పినా ఆమె వినలేదు. శుక్రవారం మధ్యాహ్నం కుమార్తెను ఇంట్లోనే చంపేసినట్లు నిందితుడు పేర్కొన్నాడు. 

చదువు కోసం... బాధ్యత కోసం పెంచాను

కుమార్తెను ఎందుకు చంపానన్న విషయాన్ని నిందితుడు సెల్ఫీ వీడియోలో వివరించాడు. ‘నా కుమార్తెను నేను చంపేశాను. నా కుమార్తెను ఎవరో అబ్బాయి కోసం పెంచలేదు. చదువు కోసం, బాధ్యత కోసం పెంచాను. పెద్దమ్మాయి ఏదో చేసిందని ఆమెను వదిలేశాను. చిన్న కుమార్తె బాక్సింగ్‌లో చేరతానంటే చేర్పించాను. అరవింద్‌ను ప్రేమిస్తున్నానని చెప్పింది. అతను గొడవల్లో ఉన్నాడు... ఆగాలని కోరాను. అయినా వినలేదు. ఆమె ప్రవర్తన నాకు నచ్చలేదు. నా తల్లి విజయలక్ష్మి వర్ధంతి రోజే నా కుమార్తెను చంపేశాను’ అని వీడియోలో పేర్కొన్నాడు. మధ్యలో నిర్జీవంగా పడి ఉన్న కుమార్తెను కూడా వీడియోలో చూపించాడు.

* కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు శుక్రవారం రాత్రి వరకు ఈ ఘటనపై ఎలాంటి వివరాలు చెప్పలేదు. నిందితుడు తమ అదుపులో ఉన్నట్లు కూడా ధ్రువీకరించలేదు. నిందితుడి పెద్దకుమార్తె ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు వచ్చి పోలీసులతో మాట్లాడారు. వరప్రసాద్‌తో అభిప్రాయభేదాలు రావడంతో ఆయన భార్య కూడా వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని