Crime News: ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం: ఆరుగురు మృతి

మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Updated : 14 Apr 2022 14:02 IST

ఏలూరు: ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ రసాయన పరిశ్రమలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  పరిశ్రమలోని యూనిట్‌-4లో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగి రియాక్టర్‌ పేలిపోయింది. మంటల ధాటికి ఆరుగురు మృతి చెందారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు సజీవదహనమవగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరోకరు మృతి చెందారు. 12 మందికి గాయాలయ్యాయి.  మృతుల్లో నలుగురు బిహార్‌ వాసులున్నట్లు గుర్తించారు. బాధితులను మొదట నూజివీడు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ జీజీహెచ్‌ తీసుకెళ్లారు.

అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌  సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొంతసేపటి తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.  ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 150 మంది ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. ఏలూరు ఎస్పీ ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ రసాయన పరిశ్రమలో ఔషధాల్లో వాడే పొడిని తయారు చేస్తున్నట్లు తెలిపారు.

ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు..

ఈ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో నూజివీడు నుంచి విజయవాడ జీజీహెచ్‌కు మొత్తం 13 మందిని తీసుకొస్తుండగా.. మార్గం మధ్యలో ఒకరు చనిపోయారు. మిగతా 12 మందిలో ఒకరికి 4శాతం గాయాలు కావడంతో అతడికి ప్రాథమిక చికిత్స అందించి స్థానిక ఆస్పత్రికి పంపేశారు. మిగిలిన 11 మంది బాధితులకు జీజీహెచ్‌ ఐసీయూలో చికిత్స అందించారు. ఈ 11 మందిలో 9 మంది 90శాతానికి పైగా, ఇద్దరు 40శాతానికి పైగా గాయాలైనట్లు బాధితులు తెలిపారు.  ఈ 11మంది బాధితులను జీజీహెచ్‌ నుంచి మెరుగైన చికిత్స కోసం గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు.

గాయపడి చికిత్స పొందుతున్నవారు..
ములపూడి నాగరాజు, సుధీర్‌ కుమార్‌ రబుదాస్‌, ముహరక్‌, నాగేశ్వరరావు, సుదీర్‌ రవిదాస్‌, రోషణ్‌, సుభానీ, విఖారి రవిదాస్‌, వరుణ్‌దాస్‌, రవికుమార్‌, జోసెఫ్‌, రాంబాబు.

మృతులు వీరే..
మనోజ్‌ కుమార్(25), అబ్బూదాస్‌(27),కారు రవిదాస్‌(40),సువాస్‌ రవిదాస్‌(32),ముప్పూడి కిరణ్‌(25),కిష్టయ్య

వెంకయ్యనాయుడు, మోదీ సంతాపం..

ఏలూరు ఘటన అత్యంత విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్కనాయుడు అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ కూడా స్పందించారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని