Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం

సికింద్రాబాద్‌ బోయగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టింబర్‌,  తుక్కు (స్క్రాప్‌) గోదాంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ

Updated : 01 Dec 2023 12:31 IST

హైదరాబాద్: సికింద్రాబాద్‌ బోయగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టింబర్‌,  తుక్కు (స్క్రాప్‌) గోదాంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 11 మంది సజీవ దహనమయ్యారు. వేకువజామున 4 గంటలకు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. బోయగూడ ఐడీహెచ్‌ కాలనీలోని స్క్రాప్‌ దుకాణంలో 12 మంది కార్మికులు మంగళవారం రాత్రి నిద్రించారు. షార్ట్ సర్క్యూట్‌ జరగడంతో అందులో భారీగా మంటలు చెలరేగాయి. వీరిలో ఒకరు కిటికీ పగులగొట్టి బయట పడగా.. మిగిలిన 11 మంది సజీవ దహనమయ్యారు.  ఘటనాస్థలానికి  8 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కట్టెలతో పాటు మంటలు త్వరగా వ్యాపించే స్వభావం ఉన్న వస్తువులు అక్కడ ఉండటంతోనే ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

మృతులంతా బిహార్‌ వలస కూలీలే..

ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. మృతులను బిహార్‌లోని ఒకే గ్రామానికి చెందిన వలస కూలీలుగా అధికారులు తెలిపారు. వీరంతా చాప్రా జిల్లా ఆజంపుర గ్రామానికి చెందినవారు. మృతులను సికిందర్‌ (40), బిట్టు (23), సత్యేందర్‌ (35), గోలు (28), దామోదర్‌ (27), రాజేశ్‌ (25), దినేశ్‌ (35), రాజు (25) చింటు (27), దీపక్‌ (26), పంకజ్‌ (26)గా గుర్తించారు.

గాంధీ ఆస్పత్రికి మృతదేహాలు

అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటన గురించి తెలుసుకున్న బిహార్‌లోని చాప్రా జిల్లా వాసులు మార్చురీ వద్దకు వచ్చారు. వీరిలో మృతుల బంధువులు, స్నేహితులు కూడా ఉన్నారు. బతుకు తెరువు కోసం కొన్నేళ్లుగా నగరంలో ఉంటున్న వారంతా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు.

మరోవైపు గాంధీ ఆస్పత్రిలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాలు పాడవకుండా వైద్యులు ఎంబామింగ్‌ చేస్తున్నారు. పోస్ట్‌మార్టం ప్రక్రియలో మొత్తం నాలుగు వైద్య బృందాలు పాల్గొననున్నాయి. ఈ వ్యవహారాన్ని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌తో పాటు సీపీ సీవీ ఆనంద్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ప్రధాని, గవర్నర్‌, సీఎం దిగ్భ్రాంతి

ఈ ఘటనపై ప్రధాని మోదీ, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్‌, పలువురు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీ రూ.2లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్‌ రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాం: మంత్రి తలసాని

అగ్నిప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించామని.. పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. 

ఘటనా స్థలం.. ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని